Sunday, October 30, 2011

లేటుగా వచ్చిన ఇమేజ్

ఆరేళ్ల క్రితం 'శ్రీ' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైనప్పటికీ 2007లో వచ్చిన 'హ్యాపీడేస్'తోటే మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్నా చాలా ఆలస్యంగా క్రేజీ స్టార్‌గా మారింది. 'హ్యాపీడేస్' తర్వాత తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె 2011 మేలో వచ్చిన సుకుమార్ సినిమా '100% లవ్' సినిమాలో ఇటు గ్లామర్, అటు పర్ఫార్మెన్స్ పరంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. చక్కని వంపుసొంపులున్నప్పటికీ మొహం వెడల్పుగా ఉండటమే ఆమె రూపంలో కొట్టొచ్చినట్లు కనిపించే మైనస్ పాయింట్. 'బద్రినాథ్'లో ఇదే స్పష్టమైంది. పాటల్లో గ్లామర్ డ్రస్సుల్లో అదరగొట్టినా ఆ సినిమా ఫ్లాపవడంతో ఆమెకి కొంత నిరుత్సాహం కలిగిన మాట నిజం. అయితే ఎన్టీఆర్‌తో చేసిన 'ఊసరవెల్లి' నటిగా ఆమెకి మరింత పేరు తెచ్చింది. అందులో నీహారికగా కోమా నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రదర్శించిన అభినయం ప్రేక్షకుల కళ్లల్లో ఇంకా మెదలుతూనే ఉంది. ఆ రకంగా ఈ సినిమా ఎన్టీఆర్ కంటే ఎక్కువగా తమన్నాకే పేరు తెచ్చింది. ప్రస్తుతం ఆమె మూడు క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది. అవి - రాంచరణ్‌తో చేస్తున్న 'రచ్చ', ప్రభాస్ సరసన చేస్తున్న 'రెబల్', రాంతో జంటగా నటిస్తున్న 'ఎందుకంటే ప్రేమంట'. ఓవైపు ఇలియానా ఇమేజ్ తగ్గిపోయినా, మరోవైపు సమంత టాప్ స్లాట్‌కి దూసుకు వస్తున్న నేపథ్యంలో నెంబర్‌వన్ హీరోయిన్ అనిపించుకోవడం తమన్నాకి అంత సులువు కాదు.

Saturday, October 29, 2011

న్యూస్: పరశురాంకి అగ్ని పరీక్ష

దర్శకుడు పరశురాం అగ్ని పరీక్షని ఎదుర్కొంటున్నాడు. అతను రూపొందించిన తాజా చిత్రం 'సోలో' 2011 నవంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పూరీ జగన్నాథ్ శిష్యుడూ, సమీప బంధువూ అయిన పరశురాం 'యువత'తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. నిఖిల్ హీరోగా నటించిన ఆ సినిమా ఓ మోస్తరు హిట్టయి, అతడికి రవితేజతో 'ఆంజనేయులు' సినిమాని తీసే అవకాశాన్ని కల్పించింది. అయితే ఆ గోల్డెన్ ఛాన్స్‌ని అతను సద్వినియోగం చేసుకోలేక పోయాడు. 'ఆంజనేయులు' ఫ్లాపైంది. ఫలితంగా పరశురాంకి పెద్ద హీరోల నుంచి అవకాశాలు రాలేదు. దాంతో 'బాణం' ఫేం నారా రోహిత్‌తో సర్దుకుపోయి 'సోలో' సినిమాని చేశాడు. కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ నాయికగా నటించిన ఈ సినిమాకి 'ఎ సాలిడ్ లవ్‌స్టోరీ' అనే ట్యాగ్ లైన్ పెట్టాడు పరశురాం. టైటిల్‌కు తగ్గట్లు ఇందులో లవ్‌స్టోరీతో పాటు ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్ కూడా ఉన్నాయని అతను తెలిపాడు. ఇటీవలి కాలంలో దేవిశ్రీ ప్రసాద్, తమన్ జోరుతో ఊపు తగ్గిన మణిశర్మ ఈ సినిమాకి మ్యూజిక్‌నిచ్చాడు. ఈ సినిమాతో తన కెరీర్ సాలిడ్‌గా మారుతుందనే పరశురాం ఆశలు నెరవేరుతాయా?

కీలక దశలో నాగచైతన్య కెరీర్

అక్కినేని నాగచైతన్య కెరీర్ కీలక దశలో ప్రవేశించింది. ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన అతను రెండు ఫ్లాపులు, రెండు హిట్లతో బేలన్స్‌గా ఉన్నాడు. తొలి సినిమా 'జోష్', నాలుగో సినిమా 'దడ' ఫ్లాపవగా; రెండు, మూడు సినిమాలైన 'ఏమాయ చేసావె', '100% లవ్' సినిమాలు హిట్టయ్యాయి. అయితే మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుదామని అతడు చేసిన 'దడ' సినిమా డిజాస్టర్ కావడం అతడికి కొంత నిరుత్సాహాన్ని కలిగించింది. టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గ్లామర్ కానీ, కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి విదేశాల్లో రిచ్‌గా చిత్రీకరించిన ఫైట్లు గానీ, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గానీ సినిమాని రక్షించలేకపోయాయి. అంతకు మించి నాగచైతన్య కేరక్టర్ ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయింది. ఫలితంగా కామాక్షి మూవీస్ అధినేత డి. శివప్రసాద్‌రెడ్డి ఖాతాలో మరో ఫ్లాప్ జతకూడింది. ఈ నేపథ్యంలో నాగచైతన్య రెండు ఆసక్తికర సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ఒకటి రాంగోపాల్‌వర్మ నిర్మిస్తున్న 'బెజవాడ' కాగా మరొకటి దేవా కట్టా డైరెక్ట్ చేస్తున్న 'ఆటోనగర్ సూర్య'. వీటిలో 'బెజవాడ' సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని నవంబర్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా మొదలు పెట్టినప్పట్నించే వార్తల్లో ఉండటం వల్ల అందరి దృష్టీ దీనిపైన ఉంది. ఇక 'ఆటోనగర్ సూర్య' ఇప్పుడే మొదలైంది. ఇందులో చైతన్య, సమంత జంటగా రెండోసారి నటిస్తున్నారు. దేవా కట్టా ప్రతిభావంతుడైన దర్శకునిగా ఇప్పటికే రుజువు చేసుకున్నందున ఈ సినిమా మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాల్లో ఒక్కటైనా హిట్టయితేనే స్టార్ హీరోగా నాగచైతన్య రూపుదాల్చే అవకాశాలుంటాయి.

Friday, October 28, 2011

సాహిత్యం: రచయితకీ, కథకీ సంబంధం ఉండొద్దా?

కొంతమంది రచయితలు రచనని అంచనా వేసేప్పుడు ఆ రచయిత జీవితాన్ని పరిగణనలోకి తీసుకోకూడదంటారు. రచనలో ఉన్న గొప్పతనాన్ని మాత్రమే అంచనా వెయ్యాలనీ, రచనకి రచయిత వ్యక్తిత్వంతో సంబంధం ఉండాల్సిన అవసరం లేదనీ అంటారు. ఈ దృక్పథాన్నే ప్రమాణంగా పెట్టుకుంటే జరిగేదేమిటి? ఒక సమాధిలాంటి స్థితిలోకి వెళ్లి రచయిత ఓ కథని సృష్టించి లోకం మీద వదులుతాడు. అది అతడి జీవితాన్ని ఏ విధంగానూ ప్రతిబింబించదు, ప్రతిబింబించాల్సిన అవసరం లేదు. ఆ రచయిత పిసినారి అయి దాతృత్వాన్ని ఆకాశానికెత్తవచ్చు. మతతత్వవాది అయి, మత సామరస్యాన్ని ఉపదేశించవచ్చు. దుర్మార్గుడయి, మంచితనాన్ని బోధించవచ్చు. స్త్రీలోలుడై ఉండి పాతివ్రత్యం గురించి ఘనంగా చిత్రించవచ్చు. అతని కథ గొప్పది కావచ్చు. అతను నీచుడు కావచ్చు. అందులో తప్పు ఎంచకూడదు - ఈ దృక్పథాన్ని మనం ఒప్పుకున్నట్లయితే, అప్పుడు ఇంకో సమస్య వచ్చి పడుతుంది. రచయితకి 'హక్కు' ఉంటే పాఠకుడికి కూడా హక్కు ఉండి తీరాలి. అతను కూడా ఓ 'సమాధి'లోకి వెళ్లి ఆ కథని ఆస్వాదించి తిరిగి తన నిత్య జీవితంలో అడుగుపెడతాడు. ఆ రచన తాలూకు ప్రభావం వాడిపైన ఏమాత్రం ఉండాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఆ కథ సాధించే ప్రయోజనం ఏమిటి? నిష్ప్రయోజనం!
కథకుడి జీవితానికీ, కథకూ ముడిపెట్టకూడదనడంలోనే అసలు పొరపాటున్నది. ఈ రెంటికీ కేవలం సంబంధం కాదు సన్నిహిత సంబంధం ఉంది. కథాసృజనకి ప్రేరణ ఇచ్చేది జీవితం. రచయిత జీవితానికైనా రూపం కల్పించేది అతని సామాజిక దృక్పథమే. రచయిత ఆత్మవంచన చేసుకోవడం అసాధ్యమేమీ కాదు. కులగజ్జి నుంచి బయటపడటానికి రవ్వంతైనా ప్రయత్నం చెయ్యనివాడు కులరహిత భావాల్ని తన కథలో ప్రవేశపెట్టవచ్చు. లౌకికవాదులు దాన్ని బేషని మెచ్చుకోవచ్చు. కాని ఇట్లాంటి రచయితలు ఏనాటికైనా ఉత్తమస్థాయిని అందుకోలేరు. వారి కథల్లో ఉండే 'వంచన'ని సమకాలికులు అర్థంచేసుకోకుండా ఉండరు. చిత్తశుద్ధితో సృజించిన కథలు జీవించే ఉంటాయి.

Thursday, October 27, 2011

న్యూస్: 'ఓ మై ఫ్రెండ్' మీదే సిద్ధు ఆశలు!

2006లో వచ్చిన 'బొమ్మరిల్లు' తర్వాత సిద్ధార్థ్‌కి చెప్పుకోదగ్గ సినిమా ఏది? ఏదీ లేదు. ఈ మధ్య కాలంలో అతను చేసిన సినిమాలు - 'ఆట' (యావరేజ్), 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' (యావరేజ్), 'ఓయ్' (డిజాస్టర్), 'బావ' (డిజాస్టర్), 'అనగనగా ఓ ధీరుడు' (ఫ్లాప్), '180' (యావరేజ్). ఇదీ అతడి ప్రస్థానం. తెలుగు హీరో అనిపించుకోడానికి ఏడేళ్లు పట్టిందని ఈమధ్య ఇంటర్వ్యూల్లో అతడు చెప్పాడు కానీ మన వాళ్లెవరూ అలా ఫీలవుతున్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం తెలుగులో కోల్పోయిన ఇమేజ్‌ని తిరిగి తెప్పించుకోడానికి అతను కష్టపడుతున్నాడు. దిల్ రాజు రూపంలో అతగాడికి ఓ మంచి ఫ్రెండ్ దొరకడం అతడు చేసుకున్న భాగ్యం. అందుకే 'ఓ మై ఫ్రెండ్' సినిమాని సిద్ధార్థ్‌తో తీస్తున్నాడు రాజు. వేణు శ్రీరాం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ 'క్లోజ్ ఫ్రెండ్' శ్రుతిహాసన్, హన్సిక హీరోయిన్లుగా నటించారు. నవదీప్ మరో కీలక పాత్ర చేశాడు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ రాహుల్ రాజ్ మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమా ఆడియో అక్టోబర్ 15న రిలీజైంది. పాటలు బాగానే ఉన్నాయని సంగీత ప్రియులు చెబుతున్నారు. ఈ సినిమాతో మరోసారి 'బొమ్మరిల్లు' మేజిక్‌ని రిపీట్ చేస్తానని నమ్ముతున్నాడు సిద్ధు. నిజానికి అది అతడికి చాలా అవసరం కూడా. ఎందుకంటే 'ఓ మై ఫ్రెండ్' కూడా ఆడకపోతే తెలుగులో అతడి కెరీర్ నిజంగా కష్టాల్లో చిక్కుకున్నట్లే. నవంబర్లోనే ఈ సినిమా రిలీజవుతున్నందున అతడి భవిష్యత్ ఏమిటో అప్పుడు తేలనున్నది.

Saturday, October 22, 2011

న్యూస్: జోరంతా సమంతదే!

టాలీవుడ్‌లో ఇప్పుడు సమంత జోరు నడుస్తోంది. 'ఏమాయ చేసావె', 'బృందావనం', 'దూకుడు' సినిమాలతో ఆమె టాప్ లీగ్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న 'ఈగ'లో హీరోయిన్‌గా నటిస్తున్న ఆమె రెండోసారి నాగచైతన్య సరసన 'ఆటోనగర్ సూర్య'లో నటిస్తోంది. తాజాగా మరో మూడు సినిమాల్లో నాయికగా ఎంపికైంది. వాటిలో మహేశ్‌తో రెండోసారి చేయబోతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', సిద్ధార్థ్ సరసన ఓ సినిమాలోనూ, అల్లు అర్జున్ సరసన మరో సినిమాలోనూ చేయబోతోంది. 'ఆటోనగర్ సూర్య'ని దేవా కట్టా డైరెక్ట్ చేస్తుండగా, మాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బేనర్‌పై కె. అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'ను 'కొత్త బంగారులోకం' ఫేం శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనుండగా, దిల్ రాజు నిర్మించబోతున్నారు. వెంకటేశ్, త్రిష మరో జోడీగా నటించే ఈ సినిమా 2012 జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనున్నది. సిద్ధార్థ్ సరసన నటించే సినిమాని నందినీరెడ్డి డైరెక్ట్ చేయనుండగా, బెల్లంకొండ సురేశ్ నిర్మించనున్నారు. ఈ సినిమా నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్‌లోకి వెళ్లనున్నది. ఇక అల్లు అర్జున్ సరసన ఆమె నటించే సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించనున్నాడు. అలాగే తన మెంటర్ గౌతం మీనన్ తెలుగు, తమిళ, మలయాళ్ భాషలు మూడింటిన్లోనూ తీసే మరో సినిమానీ సమంతా చేయనున్నది. ప్రస్తుతం ఆమె చేస్తున్న, చేయబోతున్న సినిమాలు చూస్తే మిగతా హీరోయిన్లకి కన్నుకుట్టక మానదు.

Thursday, October 20, 2011

న్యూస్: 22న 'సోలో' ఆడియో

నారా రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సోలో'. నిషా అగర్వాల్ నాయిక. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీకె సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల వైజాగ్‌లో జరిగిన చివరి షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ "ఏ సాలిడ్ లవ్‌స్టోరీ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రంలోని ప్రేమకథ ఉంటుంది. ఈ విభిన్న ప్రేమకథకు కుటుంబ భావోద్వేగాలతో పాటు యాక్షన్ అంశాలు జోడించి పరశురామ్ చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మణిశర్మ సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలను ఈ నెల 22న ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నాం. నవంబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తాం. నా తొలి ప్రయత్నంగా 'సోలో' చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది'' అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ "యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా మెచ్చే అంశాలు ఇందులో వున్నాయి. నేటి యువతరం ప్రతినిధిగా రోహిత్ ఇందులో కనిపిస్తాడు. ఈ చిత్రంలో రోహిత్‌కు కమర్షియల్ హీరోగా గుర్తింపు వస్తుంది'' అని అన్నారు.
ప్రకాష్‌రాజ్, జయసుధ, సాయాజీ షిండే, అలీ, ఎమ్మెస్ నారాయణ, శ్రీనివాసరెడ్డి, సుభాష్, నరసింహ, అనంత్, ప్రవీణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి కళ: రఘు కులకర్ణి, కెమెరా: దాశరథి శివేంద్ర, ప్రొడక్షన్ కంట్రోలర్: యుగంధర్. 

ప్రత్యేక వ్యాసం: హాస్యానికి 'రాజ'బాబు

కామెడీ ఆర్టిస్టుల్లో రాజబాబు స్థానం ప్రత్యేకమైంది. పాత తరం హాస్యనటుల్లో కస్తూరి శివరావు, రేలంగి వెంకట్రామయ్య తరువాత అంత వైభవాన్ని కళ్ల చూసింది ఆయనే. రాజబాబు తీసుకున్నంత పారితోషికం మరే ఇతర హాస్యనటుడు తీసుకోలేదేమో! ఆ రోజుల్లో కొంతమంది హీరోల పారితోషికానికి సమానంగా ఆ మొత్తం ఉండేది. ఒకచోట కుదరుగా ఉండకుండా వంకర్లు తిరిగిపోతూ వెరయిటీ మాడ్యులేషన్‌తో రాజబాబు డైలాగులు చెబుతుంటే ప్రేక్షకులు నవ్వు ఆపుకోలేక పోయేవారు. అగ్ర హీరోలు సైతం రాజబాబు వచ్చే వరకూ షూటింగ్ స్పాట్‌లో ఎదురుచూసిన సందర్భాలు ఉన్నాయి. 'నేను కోట్ల రూపాయలు సంపాదించాను' అని సగర్వంగా ప్రకటించుకున్న ఏకైక హాస్యనటుడు కూడా బహుశా రాజబాబు ఒక్కరేనేమో! హాస్య నటులు చరిత్ర రాస్తే అందులో మొదటి పేజీల్లోనే ఉండే పేరు ఆయనదని చెప్పవచ్చు. అయితే హాస్యనటుడిగా రాజబాబు ప్రస్థానం అంత తేలికగా మొదలవలేదు. పావలాతో మద్రాసుకు చేరుకున్న ఈ పుణ్యమూర్తుల అప్పలరాజు చాలాకాలం అన్నం లేక, సరైన బట్ట లేక కార్పొరేషన్ నీళ్లతో కడుపు నింపుకుంటూ ఎవరైనా పుణ్యమూర్తులు ఏరోజనై కడుపునిండా అన్నం పెడితే దాంతో రెండు మూడు రోజులు బతికేవారు. 'అలా అప్పుడప్పుడు అన్నం పెట్టిన మహానుభావుడు ఆనాటి హీరోయిన్ రాజసులోచన ఇంటి తోటమాలి. అవకాశాలు దొరక్క ట్యూషన్లు కూడా చెప్పేవాణ్ణి. నేను ట్యూషన్ చెప్పే ఇంట్లో ఏదో మూల కుక్కపిల్లలా పడుకుని ఉంటే ఎవరో లేపి కాఫీయో, రెండు ఇడ్లీలో ఇచ్చేవారు' అని ఆ రోజుల్లో రాజబాబు చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ విన్నా 'అయ్యో పాపం' అనిపించకమానదు. చివరికి ఆయన నిరీక్షణ ఫలించి 'సమాజం' చిత్రంతో పరిశ్రమకు పరిచయమయ్యారు. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజబాబు తన నటజీవితాన్ని కామెడీతో ప్రారంభించినా విలనీతో పాటు విభిన్న పాత్రలను పోషించి మెప్పించారు. హీరోగా కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. డా.దాసరి నారాయణరావు తొలి సినిమా 'తాత-మనవడు' చిత్రంలో ఆయనే హీరో. ముందు ఆ వేషం వేయడానికి వెనుకంజ వేసినా దాసరి ప్రోత్సాహంతో ఆ పాత్ర పోషించారు రాజబాబు. ఆ సినిమాకి ఆయనకి ఎంతో పేరు తెచ్చింది. ఆ తరువాత దాసరి దర్శకత్వంలో రూపొందిన 'తిరుపతి'లో కూడా ఆయనే హీరో. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాజబాబు నిర్మించిన తొలి సినిమా 'ఎవరికి వారే యమునా తీరే'కు దర్శకుడు దాసరి కావడం. 'బావా.. బావా' అనుకుంటూ ఎంతో ఆప్యాయంగా మెలిగేవారిద్దరు. దాసరి రూపొందించిన చిత్రాల్లో మంచి పాత్రలు చేశారు రాజబాబు.
పుట్టిన రోజున మంచి కార్యక్రమాలు
తన బతుకు పుస్తకంలో పేజీలు తరిగిపోతుండటంతో , ఆఖరి పేజీ దగ్గర పడిపోతోందేమోనన్న భయం ఆవరించి ఆ లోపు కొన్ని మంచి పనులు చేయాలన్న తపనతో రాజబాబు పబ్లిక్ ట్రస్ట్ ఏర్పాటు చేసి తన శక్తి మేరకు ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసేవారు. ముఖ్యంగా తన పుట్టిన రోజు ఏ ప్రయోజనం లేకుండా జరగడం అసంతృప్తికరంగా అనిపించి ఆ రోజున సీనియర్స్‌ని సన్మానించేవారు రాజబాబు. నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేసి కొత్త నటీనటులు పరిశ్రమకి పరిచయం కావడానికి దోహదపడ్డారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ రోజుల్లో 'పాతాళభైరవి' చిత్రంలో బాలకృష్ణ (అంజిగాడు) నటన రాజబాబుని ఎంతో ప్రభావితం చేసింది. ఆ సినిమాని ఓ తొంభై సార్లు చూశారాయన. చూసిన ప్రతిసారీ హాస్యనటుడు కావాలనే కోరిక బలపడేది. అందుకే తను హాస్యనటుడిగా స్థిరపడిన తరువాత ఓ పుట్టిన రోజున బాలకృష్ణను సన్మానించి తన కృతజ్ఙతలు వెల్లడించారు రాజబాబు.
నిర్మాతగా..
భవిష్యత్‌లో ఎప్పుడైనా కథ రాసుకుని స్వీయ దర్శకత్వంలో సినిమా తీయాలనే కోరిక రాజబాబుకి ఉండేది. ఆ ప్రయత్నంలో భాగంగా బాబ్ ఆండ్ బాబ్ క్రియేషన్స్ బేనరుపై 'మనిషి రోడ్డున పడ్డాడు' చిత్రాన్ని నిర్మించారు రాజబాబు. దీనికి కథకుడు ఆయనే. ఈ సినిమాలో ట్రాజెడీ వేషం వేశారు. ఎప్పుడు తమని నవ్వించే రాజబాబు తెరపై ఏడుస్తూ కనిపించే సరికి ప్రేక్షకులు కూడా కంటతడి పెట్టారు. తనని చూసిన జనం మనసారా నవ్వుకోవాలి కానీ అలా ఏడవకూడదనుకున్న రాజబాబు ఇకపై ట్రాజెడీ వేషాలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగానే ఆయన తీయాలనుకున్న 'సరస్వతి లక్ష్మి బ్రహ్మ', 'సంఘం చేసి బొమ్మలు' చిత్రాలు తీయలేకపోయారు.
మాటల్లో వేదాంతం, వైరాగ్యం
ప్రేక్షకులకు నవ్వులు పంచే రాజబాబు జీవితం వెనుక బలమైన విషాదం ఏదైనా దాగి ఉందా అనిపించేది ఒక్కోసారి. ఆయన తాగినా మత్తులో ఉన్నా, లేకపోయినా వేదాంత వైరాగ్యాల గురించి సుదీర్ఘంగా మాట్లాడేవారు. అలాగే ఇంటర్య్వూల సారాంశం వేదాంతపరంగానే ఉండేది. తెరపై అంతగా నవ్వించే రాజబాబు ఎంతో భావగర్భితంగా, వేదాంత ధోరణిలో మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచేది.
కెరీర్‌ని దెబ్బతీసిన అలవాటు
అలవాట్లు ఎప్పుడు ఎలా ప్రారంభమవుతాయో చెప్పలేం కానీ అంత బిజీగా ఉన్న రాజబాబు కెరీర్ కుదేలవడానికి ప్రధాన కారణం మద్యపానమే కారణమని చెబుతారు.విపరీతంగా తాగి షూటింగ్‌లకు గైరు హాజరయ్యేవారని అంటారు. రాజబాబుని పెట్టుకుంటే సినిమాకి హెల్ప్ అవుతుందనుకునే రోజులు పోయి ఆయనతో సినిమా చేయడం రిస్క్ అని భావించే పరిస్థితి ఏర్పడటానికి కారణం ఇదేనంటారు. అయితే తను తాగి షూటింగ్‌కి వచ్చేవాణ్ణనే అంటే రాజబాబు ఒప్పుకునేవారు కాదు. ' నేను తాగుతాను. పని లేని రోజున మాత్రమే తాగుతాను. మేకప్ వేసుకున్న తరువాత తాగను. కానీ పరిశ్రమ నన్ను దూరం చేసింది. విషప్రచారం చేసి పక్కన పెట్టింది. నిర్జీవమైన వస్తువులతో ఆడుకోండి. కానీ మనుషుల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దు' అనేవారాయన ఆ రోజుల్లో. 'నేను ఏ నిర్మాతకి, దర్శకుడికి అన్యాయం చేయలేదు. అప్పలరాజుని రాజబాబుగా మార్చి మంచి పొజిషన్‌లో నిలబెట్టి చివరికి ముంచెయ్యడం పరిశ్రమకి భావ్యమా ' అని ఆయన ఆవేదనతో ప్రశ్నించినా దానికి చివరి రోజుల్లో స్పందన కరువైంది.
ఆయనకే దక్కిన గౌరవం
తన పుట్టిన ఊరికి, కన్నవారికి ఎంతో ప్రతిష్టలు తెచ్చిన రాజబాబు శిలావిగ్రహాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నెల్లో రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా 70 మంది హాస్యనటీనటుల కలయికలో 'హాస్యకుంభమేళ' పేరుతో ఓ నవ్వుల కార్యక్రమాన్ని నిర్వహించింది తెలుగు చిత్రపరిశ్రమ. ఇదే రాజబాబుకి మాత్రమే దక్కిన గౌరవం.
(అక్టోబర్ 20 రాజబాబు జయంతి)

న్యూస్: ఒకటిన్నర వినోదం 'వెన్నెల 1 1/2'

దేవాకట్టా దర్శకత్వం వెన్నెల చిత్రానికి 'వెన్నెల 1 1/2' పేరుతో సీక్వెల్ రాబోతుంది. లవ్ ప్లస్ లాఫ్ హోల్ క్యూబ్ మైనస్ లాజిక్ అనేది ఈ చిత్రం ఉపశీర్షిక. 'వెన్నెల' చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించి అందరినీ నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిషోర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జీఆర్8(ఎయిట్) ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వాసు,వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల విదేశాల్లో పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ "వెన్నెల చిత్రానికి సీక్వెల్ నిర్మించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ఊహించని ఎన్నో ఆశ్చర్యాలు ఈ చిత్రంలో వుంటాయి. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఇటీవలే విదేశాల్లో మరో షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్నాం. త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న చివరి షెడ్యూల్తో చిత్రీకరణ పూర్తవుతుంది. నవంబరులో పాటలను, డిసెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం. తప్పకుండా వెన్నెల తరహాలోనే వెన్నెల1 1/2 కూడా ప్రేక్షకులందరిని అలరిస్తుందనేనమ్మకం ఉంది'' అని అన్నారు. చైతన్య కృష్ణ, మోనాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆరు పాటలు, రెండు ఫైట్స్ వున్నాయి.
బ్రహ్మానందం, రఘుబాబు, మాస్టర్ భరత్, శ్రవణ్, గిరిధర్, హరీష్, వెన్నెల మధు, అగ్నేష్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కాశ్యప్, కెమెరా: సురేష్ భార్గవ్, ఫైట్స్: నందు, కెమెరా: సురేష్‌భార్గవ్, సాహిత్యం: కృష్ణచైతన్య, శ్రీమణి, సిరాశ్రీ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శివశంకర్.

Wednesday, October 19, 2011

చివరి పాట చిత్రీకరణలో 'మొగుడు'

గోపీచంద్, తాప్సీ జంటగా కృష్ణవంశీ రూపొందిస్తున్న 'మొగుడు' సినిమా షూటింగ్ ఓ పాట మినహా పూర్తయింది. లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రానికి బేబి భవ్య సమర్పకురాలు. సంగీత దర్శకుడిగా బాబూశంకర్ పరిచయమవుతున్నారు. సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ, రామజోగయ్యశాస్త్రి పాటలు రాశారు.
ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలైన పాటలకి అనూహ్యమైన స్పందన వచ్చిందని నిర్మాత బుజ్జి తెలిపారు. "మిగిలి ఉన్న పాటను బుధవారం (అక్టోబర్ 19) నుంచి చిత్రీకరిస్తున్నాం. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయినట్లే. కృష్ణవంశీ సినిమా అంటే అలకలు, అల్లర్లు, అందాలు, బంధాలు, భావాలు, భావోద్వేగాలు, సరసాలు, సంప్రదాయాలు కలగలసి ఉంటాయి. అలాంటి కోవలోనే వస్తున్న సినిమా 'మొగుడు'. ఇదొక అందమైన కుటుంబ కథ. అలాగని ఫ్యామిలీ ఆడియెన్స్‌కి మాత్రమే నచ్చే సినిమా కాదిది. క్లాస్, మాస్ తేడా లేకుండా అందరికీ నచ్చుతుంది. నటునిగా గోపీచంద్‌లోని కొత్తకోణాన్ని ఇందులో చూస్తారు. ఆయన కెరీర్‌లో ఈ సినిమా మైలురాయి అవుతుంది. రాజేంద్రప్రసాద్ చేసిన కీలక పాత్ర సినిమాకే హైలైట్. నటిగా తాప్సీని ఉన్నత స్థాయిలో నిలిపే సినిమా ఇది. శ్రద్ధాదాస్ మరో నాయికగా నటించింది. నరేశ్, రోజా భార్యాభర్తల పాత్రల్లో ఆకట్టుకుంటారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్రీకాంత్, కూర్పు: గౌతంరాజు.

వేలానికి 'దూకుడు' దుస్తులు

శ్రీను వైట్ల రూపొందించిన 'దూకుడు' చిత్రంలోని క్లైమాక్స్ సాంగ్‌లో హీరో హీరోయిన్లు మహేశ్, సమంత ధరించిన ప్రత్యేక దుస్తుల్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ('మా') వేలానికి పెట్టింది. ఈ నెల 25లోగా ఎవరైతే ఎక్కువ ధరకి వేలం పాడతారో వారికి మహేశ్ చేతుల మీదుగా వాటిని అందజేస్తామని 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ తెలిపారు. మంగళవారం నిర్మాతల మండలి హాలులో జరిగిన సమావేశంలో ఈ సంగతిని ఆయన ప్రకటించారు. "ఈమధ్య కాలంలో అనేక ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో ఉన్న సినీ పరిశ్రమకు మహేశ్, శ్రీను వైట్ల సినిమా 'దూకుడు' ఓ ప్రభంజనాన్ని సృష్టిస్తూ ఊపిరిపోసింది. మన రాష్ట్రంలోనే కాక అమెరికాలోనూ గత రికార్డుల్ని బద్దలు కొడుతోంది. కలెక్షన్ల విషయంలో 'మగధీర'ను కూడా అధిగమించి ముందుకు పోతోంది. రూ. 80 కోట్ల వసూళ్ల అంచనాల్ని దాటి రూ. వంద కోట్ల అంచనాలకి చేరుకోవడం సామాన్య విషయం కాదు. ఈ సినిమాతో మహేశ్ ఇమేజ్ ఎంతగా పెరిగిందంటే ఓ వెబ్‌సైట్ నిర్వహించిన పోల్‌లో ప్రపంచవ్యాప్తంగా 50 మంది సెలబ్రిటీల్లో 12వ స్థానంలో మహేశ్ వచ్చాడు. అదీ అతని ఘనత. శ్రీను వైట్ల హీరోలతో కామెడీ చేయిస్తే తిరుగుండదని 'దూకుడు' మరోసారి చెప్పింది. కేవలం కమెడియన్లతోటే కాకుండా హీరోలతోనూ కామెడీ చేయించి మెప్పిస్తుంటాడు. త్వరలో హిందీలోనూ 'దూకుడు'ను డైరెక్ట్ చేయబోతున్నాడు. అతను అక్కడా విజయఢంకా మోగించాలి. గతంలో కొన్ని సినిమాల వస్తువుల్ని వేలం వేసి పేద కళాకారుల కోసం వినియోగించాం. ఇప్పుడు 'దూకుడు'లో హీరో హీరోయిన్లు మహేశ్, సమంత ధరించిన కాస్ట్యూమ్స్‌ని వేలం వేస్తున్నాం'' అని చెప్పారు.
శ్రీను వైట్ల మాట్లాడుతూ "దూకుడు సినిమా ఎంతగా రికార్డు కలెక్షన్లని సాధిస్తున్నదో అందుకు తగ్గట్లుగా ఈ కాస్ట్యూమ్స్‌ని మహేశ్ అభిమానులు అధిక ధరకు సొంతం చేసుకుంటారని ఆశిస్తున్నా. తద్వారా వారు ఓ మంచి పనికి ఉపయోగపడతారు. మేం కూడా ఊహించని స్థాయిలో 'దూకుడు' హిట్టయింది'' అని తెలిపారు.
శ్రీను వైట్ల తన సినిమాల్లో తెలుగు నటులకి అవకాశమివ్వాలని 'మా' సంయుక్త కార్యదర్శి మహర్షి సూచించారు. ఈ కార్యక్రమంలో మాస్టార్స్ డాట్ కామ్ శేఖర్, 'మా' సభ్యులు జయలక్ష్మి, మాణిక్ పాల్గొన్నారు.

Tuesday, October 18, 2011

న్యూస్: సిద్ధార్థ్, సమంత జోడీ



సిద్ధార్థ్, సమంత జంటగా ఓ చిత్రం రూపొందబోతోంది. 'అలా మొదలైంది' ఫేమ్ నందినీరెడ్డి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేశ్ నిర్మించనున్నారు. ఈ చిత్రం గురించి బెల్లంకొండ సురేశ్ తెలియజేస్తూ "నందినీరెడ్డి అద్భుతమైన కథ చెప్పారు. సిద్ధార్థ్, సమంత కూడా కథ వినగానే ఎంతో ఇన్‌స్పైర్ అయ్యారు. వచ్చే జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఇటీవల 'కాంచన', 'కందిరీగ' వంటి చిత్రాలు మా బేనర్‌కి ఎంతో పేరు తెచ్చాయి. ఈ సినిమా ఆ కోవలోనే పెద్ద హిట్టవుతుంది'' అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి. మహేంద్రబాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి.వి. నందినీరెడ్డి. 

న్యూస్: ప్రభాస్‌ని డైరెక్ట్ చేస్తున్న కొరటాల శివ

ప్రభాస్ కథానాయకుడిగా తాజా చిత్రం మొదలైంది. 'బృందావనం', 'ఊసరవెల్లి' చిత్రాల రచయిత కొరటాల శివ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రభాస్ స్నేహితులు వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా యు.వి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ "ఈ చిత్రంలో మా హీరో ప్రభాస్ పాత్ర తీరుతెన్నులు వైవిధ్యంగా ఉండటమే కాకుండా గెటప్ కూడా కొత్తగా ఉంటుంది. ఇంతకుముందు ప్రభాస్ ఆ గెటప్‌లో ఎవరూ చూసి ఉండరు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేస్తాం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇద్దరు ప్రముఖ నాయికలు ప్రభాస్ సరసన నటిస్తారు. వారి వివరాలను త్వరలో ప్రకటిస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది'' అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ "ప్రభాస్ కథానాయకుడిగా నా తొలి చిత్రం ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ప్రభాస్ ఇమేజ్‌కి ఏ మాత్రం తగ్గకుండా కథ ఉంటుంది'' అని అన్నారు.
"నా స్నేహితులు వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం కథ నాకు బాగా నచ్చింది. నవంబర్ నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. కమర్షియల్ హంగులన్నీ ఉంటాయి. దేవిశ్రీ సంగీతం మెప్పిస్తుంది. అన్ని వర్గాల వారికీ చేరువవుతుంది'' అని ప్రభాస్ అన్నారు.
ఈ చిత్రానికి కళ: ఎ.ఎస్.ప్రకాష్, యాక్షన్: అరసు, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్: అశోక్‌కుమార్ రాజు, రచన-దర్శకత్వం: కొరటాల శివ.

Monday, October 17, 2011

న్యూస్: హాలీవుడ్‌కి వెళ్తున్న 'కామాగ్ని'

ఇదివరకు సెక్స్ థెరపీ ఇతివృత్తంతో తెలుగులో వచ్చిన 'కామాగ్ని' సినిమా హాలీవుడ్‌లో 'కామతంత్ర' పేరుతో రీమేక్ కాబోతోంది. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి తేజ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అప్పటికి ఆయన డైరెక్టర్ కాలేదు. ఇప్పటివరకు 'కామాగ్ని' చిత్రాన్ని యూట్యూబ్‌లో 6 లక్షలమంది వరకు వీక్షించారు. ఈ సంగతి తెలుసుకున్న లాస్ ఏంజిల్స్‌కి చెందిన ఎక్స్‌ప్రెస్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ దీన్ని హాలీవుడ్‌లో నిర్మించేందుకు ముందుకు వచ్చింది. భారతీయ కథాంశం కావడంతో దర్శకత్వ బాధ్యతల్ని తనకే అప్పగించారని జగదీశ్వరరెడ్డి తెలిపారు. కేరళతో పాటు రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ జరుపనున్నారు. డిసెంబర్‌లో ఈ షూటింగ్ మొదలు కానున్నది. ఈ సినిమాకి హాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్లు పనిచేయనున్నారు. కథాంశం గురించి తెలియజేస్తూ "పోలీసులకు పట్టుబడిన కరుడు కట్టిన ఓ తీవ్రవాది ప్రమాదవశాత్తు పాత విషయాలన్నీ మరిచిపోతాడు. అతన్ని తిరిగి మాములు మనిషిని చేస్తే కానీ తీవ్రవాద కార్యకలాపాలు వెల్లడి కావు. అందుకే ఆ బాధ్యతని ఓ యువతికి అప్పగిస్తారు. సెక్స్ థెరపీ ద్వారా ఆమె ఆ టెర్రరిస్ట్‌ని మార్చే ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకోసం కేరళ వెళ్లి ఆమె కామతంత్ర విద్యను కూడా నేర్చుకుంటుంది" అని జగదీశ్వరరెడ్డి తెలిపారు.

ప్రివ్యూ: పంజా

పవన్ కల్యాణ్ హీరోగా తమిళ దర్శకుడు విష్ణువర్థన్ రూపొందిస్తున్న సినిమా 'పంజా'. తెలుగులో విష్ణువర్థన్‌కి ఇదే తొలి సినిమా. అజిత్‌తో తీసిన 'బిల్లా' డైరెక్టర్‌గా అతను తమిళంలో ప్రసిద్ధుడు. 'పంజా'లో పవన్ సరసన నాయికలుగా సారాజేన్ డయాస్, అంజలా లావణియా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. 'పులి' వంటి డిజాస్టర్ తర్వాత చాలా కసితో ఈ సినిమా చేస్తున్నాడు పవన్. 'పంజా'లో ఆయన గడ్డంతో కొత్త గెటప్పులో కనిపించబోతున్నాడు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని విష్ణువర్థన్ తీర్చిదిద్దుతున్నాడు. పవన్ 'ఖుషి' సినిమాలో మొదట కోల్‌కతా నేపథ్యం కనిపించిన సంగతి తెలిసిందే. అదివరకు చిరంజీవి 'చూడాలని ఉంది' సినిమా కూడా ఇదే బ్యాక్‌డ్రాప్‌లో కనిపించింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. అదే సెంటిమెంట్ 'పంజా'కి వర్తిస్తుందని పవన్ అభిమానులు ఆశిస్తున్నారు. బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ గొప్పగా వచ్చాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. 'క్రిష్', 'మై నేం ఈజ్ ఖాన్', 'త్రీ ఇడియట్స్' సినిమాలకి పనిచేసిన యాక్షన్ డైరెక్టర్ శ్యాం కౌశల్ ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించడం విశేషం. యువన్ శంకర్‌రాజా సంగీతం మరో ఎట్రాక్షన్ కానున్న ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల చేయాలని నిర్మాతలు సంకల్పించారు. సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బేనర్లపై నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నవంబర్‌లో పాటల్నీ, డిసెంబర్‌లో సినిమానీ విడుదల చేయడానికి వాళ్లు ప్లాన్ చేస్తున్నారు.
బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, అడివి శేష్, పరుచూరి వెంకటేశ్వరరావు, సుబ్బరాజు, ఝాన్సీ తారాగణమైన ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే: రాషుల్ కోడా, మాటలు: అబ్బూరి రవి, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: పి.ఎస్. వినోద్, ఎడిటింగ్: ఎ. శ్రీకరప్రసాద్, స్టయిలింగ్: అనూ వర్థన్, కథ, దర్శకత్వం: విష్ణువర్థన్.

Saturday, October 15, 2011

బిగ్ స్టోరీ: హవా తగ్గిన పరభాషా దర్శకులు!

ఇంతకాలం తెలుగు సినిమాల్లో పరభాషా నాయికలు, పరభాషా విలన్లతో పాటు పరభాషా దర్శకుల హోరు ఎక్కువయ్యిందని వాపోతూ వచ్చాం. తెలుగు వాళ్లని పట్టించుకోవడం లేదని బెంగపడుతూ వచ్చాం. ఇప్పుడు ఆ బాధ దర్శకుల విషయంలో పడాల్సిన అవసరం లేదు. మళ్లీ మన దర్శకులకి రోజులొచ్చాయి. ఎస్.ఎస్. రాజమౌళి, పూరి జగన్నాథ్, వి.వి. వినాయక్, శ్రీను వైట్ల, త్రివిక్రం, సుకుమార్, సురేందర్‌రెడ్డి, సంపత్ నంది, శ్రీకాంత్ అడ్డాల వంటి దర్శకులు రాణిస్తుండటంతో ఇతర భాషల నుంచి వచ్చే దర్శకుల తాకిడి ఇటీవల తగ్గింది. కొంత కాలం క్రితం తెలుగు దర్శకులపై కంటే ఇతర భాషా దర్శకులపైనే మన హీరోలు, నిర్మాతలు నమ్మకం పెట్టుకున్నట్లు కనిపించింది. తమిళ కథలు, తమిళ దర్శకులే శరణ్యమన్నట్లు మన హీరోలు, నిర్మాతలు అప్పట్లో వ్యవహరించారు. ప్రస్తుతం టాప్ హీరోల్లో పవన్‌కల్యాణ్, ప్రభాస్ మాత్రమే తమిళ దర్శకులతో పనిచేస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో విష్ణువర్థన్ 'పంజా' తీస్తుంటే, ప్రభాస్‌తో రాఘవ లారెన్స్ 'రెబల్' తీస్తున్నాడు.
ఇదివరలో తెలుగులో మంచి డిమాండ్ ఉన్న పి. వాసు, విక్రమన్, సురేశ్‌కృష్ణలను ఇప్పుడు తెలుగు హీరోలెవరూ పట్టించుకోవడం లేదు. 'ఏ మాయ చేసావె' హిట్ తర్వాత కూడా గౌతం మీనన్ వెంట మన వాళ్లెవరూ పడటం లేదు. 'ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులే' హిట్ తర్వాత కూడా సెల్వరాఘవన్ మళ్లీ తెలుగు వైపు దృష్టిపెట్టలేదు. 'సత్యం'తో ధూంధాంగా తెలుగులోకి వచ్చిన మలయాళీ సూర్యకిరణ్‌ని ఎవరూ పట్టించుకోవడం లేదు. 'ప్రియమైన నీకు', 'అమ్మాయి బాగుంది' సినిమాల దర్శకుడు బాలశేఖరన్ ఏమయ్యాడో తెలీదు. 'నాని', 'పులి' సినిమాల ఫెయిల్యూర్‌తో ఎస్.జె. సూర్య పత్తాలేకుండా పోయాడు. తెలుగులోనే దర్శకత్వంలో ఓనమాలు దిద్దుకున్న బొమ్మరిల్లు భాస్కర్ తమిళుడైనా అతన్ని తెలుగువాడిగానే ట్రీట్ చేయాలి. తమిళం వైపు చూపు సారించకుండా తెలుగులోనే కెరీర్ వెదుక్కుంటున్న కరుణాకరన్‌కూ మినహాయింపు ఇవ్వొచ్చు.
ఓ వైపు హీరోయిన్లు, ఇంకోవైపు విలన్లు, సైడు విలన్లు, కేరక్టర్ ఆర్టిస్టులు, మరోవైపు రీమేక్‌లు తెలుగు సినీ పరిశ్రమపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటే సృజనాత్మక రంగమైన దర్శకత్వం కూడా దిగుమతికి గురికావడం తెలుగు సినీరంగంలోని భావ దారిద్ర్యాన్ని పట్టిస్తున్నదని నిన్నటిదాకా బాధపడినవాళ్లు ఇప్పుడు ఒకింత ఊపిరి పీల్చుకుంటున్నారు. నిన్నటి స్థితిపై "తెలుగు సినిమా చూస్తే ఏమున్నది గర్వకారణం... సమస్తం పరభాషా వాసనమయం" అంటూ శ్రీశ్రీని అనుకరిస్తూ మాట్లాడిన కవులు ఇప్పుడు తెలుగు దర్శకులకి మంచి రోజులు రావడంతో ఖుషీ అవుతున్నారు.
తెరముందు నాయకుడు హీరో కావచ్చు. తెరవెనుక నాయకుడు (కెప్టెన్) మాత్రం దర్శకుడే. అటువంటి నాయకత్వ స్థానంలో మనవాళ్లని కాకుండా ఇతర భాషలవాళ్లకి పెద్దపీట వేయడం ఏమంత న్యాయం? 'ప్రతిభ ఎవరిలో ఉన్నా ప్రోత్సహించాలి. అందుకు భాషా భేదం అడ్డుకాకూడదు' అంటారు కొంతమంది. నిజమే. అయితే అది కొంతవరకే. ఒకరిద్దర్ని అలా తీసుకు రావడంలో తప్పులేదు. అయితే అదేపనిగా ఒకరి తర్వాత మరొకర్ని దిగుమతి చేసుకుంటూ పోతుంటే మన దర్శకులు ఏం కావాలి? మనవాళ్లు తీసే సినిమాలన్నీ ఫెయిలయ్యి, పరాయి దర్శకుల సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతుంటే.. సరేననుకోవచ్చు. అలా ఏమీ జరగడం లేదు. పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెతగా హీరోలు, నిర్మాతలు పర భాషా దర్శకులవైపు చూపు సారిస్తూ రావడం వల్లే వాళ్ల హవా నడిచింది. ఇప్పుడు వాళ్ల చేతుల్లో విజయాన్ని అందించే మంత్రదండమేదీ లేదని తెలియడంతో తిరిగి తెలుగు దర్శకులకి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఈ ట్రెండు మనకి మంచిదే.

రివ్యూ: పిల్ల జమీందార్

'అలా మొదలైంది' తర్వాత హీరోగా నాలుగు మెట్లు పైకెదిగిన నాని ఇప్పుడు 'పిల్ల జమీందార్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. 'ఎ మిలియనీర్స్ ఫస్ట్ లవ్' అనే కొరియన్ సినిమాని ఆధారం చేసుకుని, దానికి మన నేటివిటీని జోడించి ఈ సినిమాని రూపొందించాడు నూతన దర్శకుడు అశోక్. టైటిల్‌కి తగ్గట్లు కథంతా నాని పోషించిన ప్రవీణ్ జయరామరాజు అనే పాత్ర చుట్టూ నడుస్తుంది ఆ పాత్రని సహసిద్ధమైన శైలిలో సునాయాసంగా చేసుకుపోయాడు నాని. రూ. 5000 కోట్ల ఆస్తికి వారసుడైనప్పటికీ ఆ ఆస్తి దక్కాలంటే తాత పెట్టిన కండిషన్లని ఎదుర్కోడానికి అతడు చేసే ప్రయత్నాలు, చేష్టలు మంచి వినోదాన్నిచ్చాయి. చదువంటే ఆమడ దూరం పరిగెత్తేవాడిగా, ఆవేశపరుడిగా, అహంభావిగా నాని ప్రదర్శించిన నటనని మెచ్చుకోకుండా ఉండలేం.
దర్శకుడు అశోక్ కొత్తవాడైనప్పటికీ నాని నుంచి నటనను ఎలా రాబట్టుకోవాలో తెలిసినవాడి మల్లే అవుపించాడు. ఫస్టాఫ్‌లోని పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ వల్ల ఇంటర్వల్ అప్పుడే వచ్చిందా అనిపించింది. కొన్ని కామెడీ సీన్లు పండకపోయినా ఎక్కువ సీన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వించాయి. సెకండాఫ్‌లోనూ వినోదం ఉన్నా కథ మెలోడ్రామా వైపు మళ్లడంతో కొన్ని సీన్లు బరువుగా తోస్తాయి. కాలేజీ ఎలక్షన్లనేవి కథకి నప్పలేదు. వాటిని కథలో బలవంతంగా చొప్పించినట్లనిపిస్తుంది. మెలోడ్రామా ఎక్కువైనా క్లైమాక్స్ చిత్రీకరణ బాగుంది. చివర్లో ఓ చక్కని సందేశాన్ని కూడా దర్శకుడిచ్చాడు.
అయితే నాని, హరిప్రియ మధ్య కెమిస్ట్రీ సరిగా వర్కవుట్ కాలేదు. వాళ్లమధ్య రొమాంటిక్ యాంగిల్ మిస్సయ్యింది. సెకండాఫ్‌లో మెలోడ్రామా ఎక్కువైన విషయాన్ని దర్శకుడు గుర్తించలేకపోయాడు. అందువల్లే కొన్ని సీన్లు చికాకు కలిగించాయి. ప్రవీణ్ జయరామరాజు పాత్రకి నాని పూర్తి న్యాయం చేశాడు. అతని హావభావాలే అతనెట్లాంటి నటుడో తెలియజేస్తాయి. 'అలా మొదలైంది'లో నాని కంటే నిత్యమీనన్ ఎక్కువగా ఆకట్టుకుంటే 'పిల్ల జమీందర్' మాత్రం పూర్తిగా నాని సినిమానే. హరిప్రియని మెయిన్ హీరోయిన్‌గా ఎలా ఎంచుకున్నారో అర్థంకాదు. ఆమెలో గ్లామర్, ప్రతిభ రెండూ కనిపించలేదు. ఆమె బదులు మరో చక్కని హీరోయిన్ ఆ పాత్ర చేసినట్లయితే సినిమాకి మరింత ఆకర్షణ వచ్చి ఉండేది. బిందుమాధవి బాగున్నా ఆమెని దాదాపు గెస్ట్ ఆర్టిస్ట్‌కింద చూపారు. మిగతా ఆర్టిస్టుల్లో రావు రమేశ్, శివప్రసాద్, అవసరాల శ్రీనివాస్, ఎమ్మెస్ నారాయణ బాగా చేశారు.
సినిమాలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది చంద్రశేఖర్ రాసిన డైలాగులు. త్రివిక్రం శైలి కట్ డైలాగ్స్‌తో అతను బాగా నవ్వించాడు. మొత్తంగా చూస్తే 'పిల్ల జమీందర్'ని ఓసారి చూడ్డంలో వచ్చే నష్టమేమీ లేదు.

Friday, October 14, 2011

న్యూస్: ప్రతిభకి తగ్గ ఫలితం పొందని మ్యూజిక్ డైరెక్టర్లు

ప్రతిభ ఉంటే సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ కావడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే అది ఉపాధికి పనికొస్తుందేమో కానీ మానసికంగా అంత సంతృప్తినివ్వదు. ఈ సంగతి చాలామంది సంగీత దర్శకులకి అనుభవమే. తమ ప్రతిభకి తగ్గట్లుగా ఇక్కడ పారితోషికాలు అందటం లేదని వాళ్లు బాధపడుతున్నారు. ఓవైపు ఓ సినిమా హిట్టయితే డైరెక్టర్‌కి కోట్లు చెల్లించేందుకు సిద్ధపడుతున్న నిర్మాతలు సంగీత దర్శకుల వద్దకు వచ్చేసరికి గీసి గీసి బేరాలాడుతున్నారు. సినిమా రిలీజైన వెంటనే ఆ సంగీత దర్శకుడి స్థాయిని బట్టి కూడా రెమ్యూనరేషన్లు ఆధారపడి ఉంటున్నాయి. చాలా సందర్భాల్లో సినిమా హిట్టయినా, ఆడియో సీడీలు ఆశించిన రీతిలో సేల్ కాకపోతే ఆ ప్రభావం మ్యూజిక్ డైరెక్టర్ రెమ్యూనరేషన్ మీద పడుతోంది. కొన్ని సందర్భాల్లో సినిమా చెత్తగా ఉన్నా మ్యూజిక్ సూపర్‌హిట్టవడం మనం చూస్తున్నాం. అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ప్రతిభకి తగ్గ ఫలాన్ని పొందాలి. కానీ అప్పుడు కూడా అతనికి మొండిచేయే ఎదురవుతోంది. ఇవాళ ఆడియో సేల్స్ బాగాలేవు కాబట్టి మ్యూజిక్ మీదపెట్టే బడ్జెట్ తగ్గించమని మ్యూజిక్ డైరెక్టర్లని కోరుతున్నారు నిర్మాతలు. దానికి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఒప్పుకోకపోతే తక్కువ వసూలుచేసే మ్యూజిక్ డైరెక్టర్లని తీసుకుంటున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు కోరుకుంటున్నారు.

న్యూస్: 'ఊసరవెల్లి' ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్?!

మహేశ్ 'దూకుడు' తొలివారం రూ. 50 కోట్ల గ్రా, రూ. 35 కోట్ల షేర్ సాధించిందని నిర్మాతలు ప్రకటిస్తే, మాది అంతకంటే పెద్ద రికార్డ్ అంటూ ఎన్టీఆర్ 'ఊసరవెల్లి' నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ప్రకటనలిచ్చారు. ఆయనిచ్చిన ప్రకటన ప్రకారం ఆ సినిమా తొలి వారం రూ. 56 కోట్ల గ్రాస్, రూ. 39 కోట్ల షేర్ సాధించింది. అంటే షేర్ విషయంలో 'దూకుడు' కంటే 'ఊసరవెల్లి' నాలుగాకులు ఎక్కువ చదివిందన్న మాట. తొలి వారం కలెక్షన్లలో ఇది ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్. చిత్రమేమంటే 'దూకుడు'ది జెన్యూన్ విజయమని (నిర్మాతలు ఎక్కువ కలెక్షన్లు ప్రకటించ వచ్చు గాక) ఇండస్ట్రీ, ట్రేడ్ వర్గాలు అంగీకరిస్తుంటే, 'ఊసరవెల్లి'ది జెన్యూన్ విజయమని ఆ వర్గాల్లో అత్యధికులు నమ్మడం లేదు. ఎందుకంటే 'ఊసరవెల్లి' ఆడుతున్న చాలా థియేటర్లలో కనిపిస్తున్న ప్రేక్షకుల సంఖ్యే దానికి ప్రబల నిదర్శనం. అయితే తమదే రికార్డ్ విజయమని చెప్పుకోవడానికి హీరోలు, వారి అభిమానులు తాపత్రయపడుతుంటే రికార్డులు బద్దలు కాకుండా ఉంటాయా? రానున్న రోజుల్లో 'పంజా', 'రచ్చ' సినిమాలకి ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయోననే కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ రికార్డుల దాహం ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుందో తెలీదు కానీ ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ మాత్రం 'దూకుడు', 'ఊసరవెల్లి' నిర్మాతల మీద వేయి కళ్లు వేసి చూస్తున్నట్లు సమాచారం.

Thursday, October 13, 2011

జ్ఞాపకాలు: షావుకారు జానకి

మూడు నెలల పసిపాపను ఎత్తుకుని 17 ఏళ్ల వయసులో ఉన్న అమ్మాయి సినిమా ఛాన్సుల కోసం తిరగడాన్ని ఎలా ఊహించాలి? ఇదేదో ఇప్పటి సంఘటన కాదు. 1940ల కాలంలో జరిగింది. ఆ 17 ఏళ్ల యువతి ఎవరో కాదు, షావుకారు జానకి! అంతే కాదు, సినిమాలు చూడ్డమే తప్పనుకునే కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఏకంగా 385 సినిమాల్లో నటించడం కూడా అసాధారణం. తన కెరీర్‌లో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, రాజ్‌కుమార్, శివాజీ గణేశన్ వంటి గొప్ప నటులతో నటించిన జానకి సినిమాల్లో చేరడం అంత ఈజీగా జరగలేదు.
జానకి తండ్రి ఓ పేపర్ తయారీదారుడు. వ్యాపారం కారణంగా తరచూ ఊళ్లు మారుతుండే ఆయన వల్ల ఆమె చదువు సరిగా సాగలేదు. 15 ఏళ్ల వయసులో ఆల్ ఇండియా రేడియోలో తెలుగు నాటకాలు ఆడుతున్నప్పుడు ఆమె గొంతు విని, ఆమెని చూడాలనుకున్నారు ప్రఖ్యాత దర్శకుడు బి.ఎన్. రెడ్డి. ఆమెని చూసి సినిమా ఆఫర్ ఇచ్చారు. సంతోషంతో ఈ సంగతిని చెప్పడానికి ఇంటికెళ్లిన జానకికి నిరాశ ఎదురైంది. ఆమె తల్లి, సోదరులు మరో మాటలేకుండా ఆ అవకాశాన్ని తిరస్కరించారు. ఆల్ ఇండియా రేడియోకే ఆమెని పంపడం పెద్ద తప్పయ్యిందని భావించిన వాళ్లు అప్పటికప్పుడు సంబంధం చూసి 1947లో పెళ్లి చేసేశారు. పెళ్లయిన రెండేళ్లకి మరో ఉద్యోగం కోసం ఉన్న ఉద్యోగాన్ని వదిలేశాడు ఆమె భర్త. అప్పుడు జానకి గర్భవతి. అప్పుడామె గతంలో తనకొచ్చిన సినిమా అవకాశం గురించి చెప్పి, సినిమాల్లో నటించడానికి అనుమతి కోరింది. భర్త వెంటనే ఒప్పుకున్నాడు. బిడ్డని కన్నాక ఆ పాపతో పాటే వెళ్లి బి.ఎన్. రెడ్డిని కలిసింది జానకి. ఆ సమయంలో ఆయన చేతిలో సినిమాలేవీ లేవు. తన ఆర్థిక పరిస్థితి వివరించి సినిమాలే తనకి దిక్కని ఆయనకు చెప్పింది జానకి. దాంతో ఆయన ఆడిషన్ కోసం తన తమ్ముడు నాగిరెడ్డి వద్దకు పంపాడు. నెల రోజుల మానసిక వేదన తర్వాత 'షావుకారు'లో హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు ఆమెకి కబురొచ్చింది. అంతే! ఇటు విమర్శకుల, అటు ప్రేక్షకుల ప్రశంసలు పొందిన ఆ సినిమాతో 'షావుకారు' ఆమె ఇంటిపేరుగా మారిపోయింది.
అయితే వ్యక్తిగత జీవితంలో ఆమె కష్టాలు తీరలేదు. ఆ సినిమా షూటింగ్ జరిగేప్పుడు ఇంటికొచ్చి ఎన్టీఆర్‌తో తను చేసిన సీన్లు చెప్పినప్పుడు ఆమె భర్త అసూయతో రగిలిపోయేవాడు. మాటలతో వేధించాడు కూడా. కానీ తనని నమ్మమని ఆమె అతన్ని అర్థించింది. ఎలాగైతేనేం... నటిగా ఆమె అందరి హృదయాల్ని చూరగొంది. మొహంలో గ్లామర్ లేకపోయినా తన డైలాగ్ డెలివరీ, హావభావాలతోటే ఆమె తెరపై రాణించింది. 1950, 60లలో చక్కటి పాత్రలతో తనదైన ముద్రని వేసిందామె. ఆమె తెలుగులోకంటే తమిళంలో మరింత పేరు తెచ్చుకోవడం విశేషం. బి.ఎస్. రంగా, బి.ఆర్. పంతులు వంటి డైరెక్టర్ల కారణంగా కన్నడంలోనూ ఆమె రాణించింది. రాజ్‌కుమార్‌తో ఆమె చేసిన సినిమాలు హిట్టయి, అక్కడా ఆమెకి పేరు తెచ్చాయి.
కెరీర్‌లో ఉచ్ఛ స్థితిలో ఉండగా 1965 ప్రాంతంలో కె. బాలచందర్‌కి చెందిన నాటక సంస్థలో చేరి రంగస్థలంపైనా అడుగుపెట్టింది. అయితే వెండితెర జీవితంలో ఆమె సాధించిన విజయాలు వ్యక్తిగత జీవితంలోని ఆటుపోట్ల కారణంగా వెలుగుతగ్గాయి. ఆమె వైవాహిక జీవితం ఒడిదుడుకులకు గురయ్యింది. పిల్లల భవిష్యత్తు కోసం సగటు భారతీయ స్త్రీకు మల్లే కష్టాల్ని భరించింది. ఆమె ఓ భార్యగా విఫలమయి ఉండోచ్చు కానీ, ఓ తల్లిగా ఎప్పుడూ ఆమె విఫలం కాలేదు. 80 ఏళ్ల వయసులో బెంగళూరు శివార్లలో ప్రశాంత జీవితం గడుపుతున్న ఆమె ముని మనవలు, మనవరాండ్ర కోసం తరచూ చెన్నై వెళ్తుంటుంది.

ప్రివ్యూ: మొగుడు

కృష్ణవంశీ, గోపీచంద్ తొలి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'మొగుడు'. ఈ సినిమా ప్రోమోస్ అన్నీ ఆమధ్య గుణశేఖర్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చి ఫ్లాపైన 'వరుడు'ను గుర్తు చేస్తున్నాయి. 'వరుడు' ఫ్లాపవడం వల్లే పెళ్లి అనే కాన్సెప్టుతో హిట్ సినిమా చేయాలనే పట్టుదలతో 'మొగుడు'ని కృష్ణవంశీ తీసినట్లు అనిపిస్తుంది. 'మొగుళ్లందరూ మగాళ్లే కానీ, మగాళ్లందరూ మొగుళ్లు కారు. చాలామంది మొగుళ్లు మొగుళ్లలా కాకుండా మగాళ్లలా మిగిలిపోతున్నారు. అలా ఉండొద్దు' అనే కథాంశంతో ఈ సినిమాని కృష్ణవంశీ రూపొందించాడు. 'శశిరేఖా పరిణయం', 'మహాత్మ' వంటి ప్రేక్షకులు సరిగా ఆదరించని రెండు సినిమాల తర్వాత కృష్ణవంశీ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తే, 'వాంటెడ్' వంటి డిజాస్టర్ తర్వాత గోపీచంద్ ఈ సినిమా చేశాడు. అందాల తార తాప్సీ ఇందులో పర్ఫార్మెన్స్‌కి ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసింది. తన పాత్రకు ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. కాలం కలిసొస్తే ఈ పాత్రకి ఆమె అవార్డులు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరో నాయికగా శ్రద్ధాదాస్ నటించింది. గోపీచంద్ తండ్రిగా రాజేంద్రప్రసాద్ నటించడంతో ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ వచ్చింది. తాప్సీ తల్లిదండ్రులుగా రోజా, నరేశ్ కనిపిస్తారు.
లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బేనర్‌పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా బాబూశంకర్, సినిమాటోగ్రాఫర్‌గా శ్రీకాంత్ నర్రోజు, డైలాగ్ రైటర్‌గా భీం శ్రీను పరిచయమవుతున్నారు. మలయాళీ అయిన బాబూశంకర్ ఇప్పటివరకు 400 వరకు యాడ్ ఫిలింస్ తీయడం గమనార్హం. సీతారామశాస్త్రి నాలుగు పాటలు, సుద్దాల అశోక్‌తేజ, రామజోగయ్యశాస్త్రి తలో పాట రాసిన ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Wednesday, October 12, 2011

ఇంటర్వ్యూ: మహేశ్

'దూకుడు'తో పోకిరి' ఇమేజ్ నుంచి బయటకొచ్చేశా 


'దూకుడు' వల్ల జరిగిన మంచేమిటంటే, 'పోకిరి' ఇమేజ్ నుంచి బయటకు వచ్చేశాను - అని చెప్పారు మహేశ్. ఆయన హీరోగా నటించిన 'దూకుడు' చిత్రం రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం విజయోత్సాహంలో ఉన్న మహేశ్ చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే...

శ్రీను వైట్ల చెప్పినట్లు ఇది యూనివర్సల్ స్క్రిప్టు. ఇంతవరకు నా కెరీర్‌లో ఇంత కంప్లీట్ స్క్రిప్టు వినలేదు. విన్నప్పుడే చాలా ఆనందం వేసింది. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం, సినిమా ఇంత పెద్ద హిట్టయినందుకు. నేను చేసిన కేరక్టర్‌లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అందుకే ఐ లైక్ ద స్క్రిప్ట్. ఇందులో తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ ఉంది, అదే సమయంలో ఓ పోలీస్ యాంగిల్ ఉంది, పొలిటికల్ యాంగిల్ ఉంది.. ఇలా మూడు యాంగిల్స్ ఉన్న మంచి కేరక్టర్. ఎప్పుడూ ఇలాంటి పూర్తి స్థాయి భావోద్వేగాలున్న సినిమాలు చేయడం కష్టం. ఇలాంటి స్క్రిప్టులు చాలా అరుదుగా వస్తుంటాయి. 'దూకుడు' వల్ల జరిగిన మంచేమిటంటే, 'పోకిరి' ఇమేజ్ నుంచి బయటకు వచ్చేశాను. 'దూకుడు'కంటూ ప్రత్యేకంగా ఎలాంటి ఇమేజ్ రాలేదు. ఎందుకంటే ఇది యూనివర్సల్ స్క్రిప్టు కావడం. అన్ని యాంగిల్స్ కవరయ్యాయి. 'పోకిరి' అనేది ఒక కేరక్టర్ బేస్ట్ సినిమా. ఇది అలా కాదు. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని మాకందరికీ మొదట్నించీ చాలా నమ్మకంగా ఉండేది. ఆ నమ్మకంతోనే పనిచేశాం. ఫలితం సాధించాం.
నాన్న ఫోనే బెస్ట్ కాంప్లిమెంట్
నాకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ నాన్నగారు ఫోన్ చేయడమే. ఆ టైమ్‌లో నేనూ, శ్రీనూ ఒక్కచోటే ఉన్నాం. మార్నింగ్ షో చూసి ఫోన్ చేశారు. రూ. 80 కోట్లు వసూలు చేస్తుందని చెప్పారు. నాకైతే ఆయన మాటలు వెంటనే జీర్ణం కాలేదు.  ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది, 'దూకుడు' ఎంత ఇంపాక్ట్ కలిగిస్తున్నదో. అమెరికాలో తొలి రెండు, మూడు రోజుల కలెక్షన్ల ఫిగర్లు చూసి నేను నిజంగా నమ్మలేకపోయా. లాజ్ ఏంజిల్స్ టైమ్స్ ప్రత్యేక వ్యాసం రాయడం సెన్సేషనల్ న్యూస్. నా వరకు అమెరికా అనేది ఇంకో నైజాంలా అయిపోయింది.
ఒక్కటే సందేహం
శ్రీను స్క్రిప్టు చెప్పినప్పుడు ఒక్కటే సందేహం ఉండేది. 'పోకిరి'లో నేను పోలీస్ అనేది చివర్లోనే తెలుస్తుంది. ఇందులో ఇంట్రడక్షన్ సీన్‌లోనే పోలీస్ అని చెప్పేస్తాం. అలా చెప్పి పోలీస్ కేరక్టర్ నడపడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. ఈ సందేహం నేను చెబితే అలాంటి డౌటేమీ పెట్టుకోవద్దనీ, మన సినిమా బ్లాక్‌బస్టర్ అని ఫిక్సయిపొమ్మని చెప్పారు శ్రీను. అదే జరిగింది. డైరెక్టర్‌తో కమ్యూనికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పాత్రలో ప్రవేశించాలంటే అది చాలా అవసరం. ఈ విషయంలో శ్రీనుగారు ఈజ్ పర్‌ఫెక్ట్ ఫర్ మీ.
ఎమ్మెల్యే రోల్ హైలైట్
ఎమ్మెల్యే కేరక్టర్ రిస్క్ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. హైలైట్ అవుతుందనే అనుకున్నాం. 'ఆ గెటప్‌లో మిమ్మల్ని చూడాల'ని శ్రీనుగారు అన్నారు. దాన్నాయన హైలైట్‌గా ఫీలయ్యారు. అంతేకానీ రిస్కనేది మైండ్‌లో రాలేదు. అఫ్‌కోర్స్. మెళ్లో పులిగోరనేది చివరలో జత కలిసింది. తెలంగాణ యాసని ఓవర్‌బోర్డ్‌గా వెళ్లకుండా నీట్‌గా చేసుకు వెళ్లాం. అది పే చేసింది. అందరూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతీకారం కథని వినోదాత్మకంగా చెప్పడం నాకు తెలిసి ఇదే తొలిసారి.
ప్రకాశ్‌రాజ్ పాత్ర ఇష్టం
నా పాత్ర కాకుండా ప్రకాశ్‌రాజ్ చేసిన పాత్ర బాగా ఇష్టం. శ్రీనుగారు చాలా బాగా దాన్ని డిజైన్ చేశారు. అది వెరీ స్పెషల్ కేరక్టర్. నిజ జీవితంలోనూ నేను మా నాన్నగారికి బాగా సన్నిహితం.
కామెడీని ఎంజాయ్ చేశా
బాంబేలో జగన్ చూసి ఇచ్చిన కాంప్లిమెంట్ మర్చిపోలేను. కామెడీ టైమింగ్ బాగుందనీ, కొన్ని సీన్లలో బ్రహ్మానందంగార్ని మించిపోయారనీ అన్నారు. అంతకంటే మంచి కాంప్లిమెంట్ వేరేముంటుంది. నిజంగానే సెకండాఫ్‌లో వచ్చిన కామెడీ సీన్స్‌ని బాగా ఎంజాయ్ చేశా. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ టెర్రిఫిక్ కామెడీ యాక్టర్లు. వాళ్లతో కలిసి చెయ్యడం చాలా సంతోషం.
స్క్రిప్టుకి ఇంప్రెస్సయ్యా
వచ్చే ఏడాది నావి మూడు సినిమాలు వచ్చే అవకాశముంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో చేస్తున్న 'బిజినెస్‌మ్యాన్' వచ్చే జనవరిలో వస్తుంది. ఇప్పటికే సగం సినిమా పూర్తయింది. 'దూకుడు'తో పోలిస్తే మరో భిన్నమైన పాత్ర. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'లో వెంకటేశ్‌గారు, నేను బ్రదర్స్‌గా చేస్తున్నాం. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చెప్పిన స్క్రిప్టుకి బాగా ఇంప్రెస్ అయ్యా. వెంకటేశ్‌గారు చాలా మంచి యాక్టర్. ఆయనతో సన్నిహితంగా ఉంటా. హిందీలో చేసేంత టైమ్ లేదు. నేను ప్రయోగాలు చెయ్యను. మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తా.

న్యూస్: 'మొగుడు'ని 'రాఖీ' అంత కావాలన్న ఎన్టీఆర్

'మొగుడు' సినిమా తన 'రాఖీ' అంత గొప్ప సినిమా కావాలని ఆకాక్షించాడు ఎన్టీఆర్. దీంతో విన్నవాళ్ల చెవులూ, చూసినవాళ్ల కళ్లూ తరించిపోయాయి. "కృష్ణవంశీ తీసిన 'రాఖీ'లో గొప్ప పాత్ర చేశా. ఇప్పటిదాకా ఎన్ని పాత్రలు చేసినా, ఇకముందు ఎన్ని పాత్రలు చేసినా 'రాఖీ' పాత్రని మర్చిపోలేను. కథచెప్పి నన్ను ఏడిపించిన ఏకైక దర్శకుడు వంశీనే. నాకు 'రాఖీ' మాదిరిగానే నా మిత్రుడైన గోపీకి ఇది బ్రహ్మాండమైన సినిమా అవుతుంది" అని చెప్పాడు ఎన్టీఆర్. వాస్తవమేమంటే 'రాఖీ' సినిమా కమర్షియల్‌గా చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేదు. అత్తింటి ఆరళ్లకు బలైపోయిన తన చెల్లెలి మాదిరిగా మరే చెల్లెలూ అన్యాయానికి గురి కాకూడదని ఆడపిల్లల్ని ఆదుకునే అన్నగా ఆ సినిమాలో ఎన్టీఆర్ నటించాడు. ఎప్పటిలాగే ప్రతి పాత్రనీ 'ఓవర్ బోర్డ్'కు తీసుకెళ్లే అలవాటున్న కృష్ణవంశీ 'రాఖీ' పాత్రనీ ఓవర్‌గానే మలిస్తే, తన ఓవరాక్టింగ్‌తో ఆ కేరక్టర్‌కి న్యాయం చేశాడు ఎన్టీఆర్. ఆ సినిమా తెలుగుదేశంలోని ప్రతి చెల్లినీ కదిలిస్తుందని వాళ్లు ఆశించారు. కానీ జరిగింది అందుకు విరుద్ధం. ప్రేక్షకులతో పాటు విమర్శకుల్నీ ఆ సినిమా మెప్పించలేకపోయింది. అలాంటి సినిమాని పట్టుకుని గోపీచంద్‌కి 'మొగుడు' తన 'రాఖీ' అంత సినిమా కావాలని ఎన్టీఆర్ కోరుకోవడం చూసి, "ఆ సినిమాలాగానే 'మొగుడు' కూడా ఫట్టవ్వాలని ఎన్టీఆర్ కోరుకుకుంటున్నాడా?" అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. చివరికి గోపీచంద్‌కి కూడా ఎన్టీఆర్ మాటలు రుచించలేదని అప్పుడు అతని మొహమే చెప్పింది.

న్యూస్: 'దూకుడు' 100 కోట్లు కలెక్ట్ చేస్తుందన్న కృష్ణ!

మహేశ్ 'దూకుడు' ఓవరాల్‌గా రూ. 100 కోట్లని వసూలు చేస్తుందని జోస్యం చెప్పారు సీనియర్ సూపర్‌స్టార్ కృష్ణ. అక్టోబర్ 10 రాత్రి హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్లో జరిగిన సినిమా సక్సెస్‌మీట్‌లో సతీసమేతంగా పాల్గొన్న ఆయన 'దూకుడు' గురించి ఒకింత ఉద్వేగంగా మాట్లాడారు. చాలా రోజుల తర్వాత ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 'దూకుడు' సినిమా ఇంత హిట్టవడానికి చాలా కారణాలున్నాయన్నారు. "ఈ సినిమా చూసే వాళ్లలో క్లాస్ ఆడియెన్స్ ఉంటారు, మాస్ ఆడియెన్స్ ఉంటారు, యూత్ ఉంటారు, ముఖ్యంగా పిల్లలుంటారు, లేడీస్ ఉంటారు. అన్ని రకాల ఆడియెన్స్‌కి నచ్చింది ఈ సినిమా. కాబట్టే ఇంత పెద్ద హిట్టయింది. ఇందులో మ్యూజిక్ బాగుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. డైరెక్షన్ చాలా బాగుంది. కెమెరా చాలా బాగుంది. ఎన్నో రికార్డులు బద్దలుకొట్టి విపరీతమైన కలెక్షన్లు ఇప్పటివరకు కలెక్ట్ చేసింది. ఇందులో ముఖ్యంగా పిక్చర్ మొదలు పెట్టిన దగ్గర్నుంచీ ఎండింగ్ వచ్చేవరకూ అందరి చేతా నవ్వించారు. సినిమా చూస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాం. ఆర్టిస్టులంతా చాలా బాగా యాక్ట్ చేశారు. మహేశ్ అన్ని సినిమాల్లోకంటే ఈ సినిమాలో చాలా అందంగా ఉన్నాడు. చాలా బాగా చేశాడు. నాకు చాలా బాగా నచ్చిన చిత్రమిది. 'పోకిరి' సినిమా చూసిన వెంటనే అది 40 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పాను. 40 కోట్లూ కలెక్ట్ చేసింది ఆ సినిమా. 75 సంవత్సరాల రికార్డుల్ని బద్దలుకొట్టిన సినిమా 'పోకిరి'. ఇప్పుడు 'దూకుడు' మార్నింగ్ షో చూడగానే ఇంటికొచ్చి మహేశ్‌కి నేను ఫోన్‌చేశాను. అప్పుడు శ్రీను వైట్ల కూడా మహేశ్ పక్కనే ఉన్నాడు. ఆ ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్పి 80 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేస్తుందని చెప్పాను. ఈ రోజున ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, కర్ణాటకలోనూ, తమిళనాడులోనూ, ఒరిస్సాలోనూ, నార్త్ ఇండియాలోనూ, విదేశాల్లో కూడా రికార్డులు బద్దలుకొట్టింది. నేననుకున్నట్లు 80 కోట్లు కాదు, 100 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేయబోతోంది. 80 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రని తిరగరాయబోతోంది కలెక్షన్ల విషయంలో" అని ఆయన చెప్పారు.

న్యూస్: అభిమానుల మధ్య రికార్డుల గోల!


మహేశ్ 'దూకుడు' బాక్సాఫీస్ వద్ద యమ దూకుడుతో దూసుకుపోతుంటే, ఎన్టీఆర్ 'ఊసరవెల్లి'ని అంతకంటే హెచ్చు స్థాయిలో 'ప్రమోట్' చేయడానికి నానా హంగామా జరుగుతోంది. తొలిరోజు 'దూకుడు' రూ. 12 కోట్ల గ్రాస్ సాధించిందని దాని నిర్మాతలు ప్రకటిస్తే, 'ఊసరవెల్లి' ఏకంగా 15 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిందని దాని నిర్మాత ప్రకటించాడు. దీంతో ఇప్పుడు ఈ రెండు సినిమాల విషయంలో అభిమానులు 'రికార్డుల'పై దృష్టిపెట్టారు. 'దూకుడు'కి మార్నింగ్ షో నుంచే జెన్యూన్‌గా హిట్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. నిజంగానే అది సరికొత్త రికార్డులు సాధించే దిశగా వెళ్తుంటే, దాని నిర్మాతలు అది సాధించే రికార్డుల్నే హైలైట్ చేస్తూ రావడం మిగతా హీరోల అభిమానుల్లో పౌరుషాన్ని రగిల్చింది. 'ఊసరవెల్లి' విషయంలో అదే జరుగుతోంది. 'దూకుడు' కంటే తమ హీరో సినిమాయే పెద్ద హిట్టని చెప్పడానికి ఎన్టీఆర్ అభిమానులు హంగామా చేస్తున్నారు. అయితే విడుదలైన రోజే 'ఊసరవెల్లి'కి బ్యాడ్ టాక్ వచ్చింది. చాలామంది ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ పాత్రని డైరెక్టర్ సురేందర్‌రెడ్డి చూపించిన తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. 'ఊసరవెల్లి' వచ్చాక టాప్ హీరోల్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలో సురేందర్‌రెడ్డికి తెలీడం లేదనే వ్యాఖ్యలూ వినిపించాయి. ఇప్పటివరకు అతను కల్యాణ్‌రాం (అతనొక్కడే), రవితేజ (కిక్)కి మాత్రమే హిట్లివ్వగలిగాడు. ఎన్టీఆర్‌తో చేసిన 'అశోక్', మహేశ్‌తో చేసిన 'అతిథి' ఫ్లాపయ్యాయి. ఇప్పుడు 'ఊసరవెల్లి'తో అదే ట్రెండుని అతను కొనసాగించాడని విమర్శకులు అంటున్నారు. వీకెండ్‌లో బాగానే కలెక్ట్ చేసిన 'ఊసరవెల్లి' అసలు సత్తా సోమవారంతో తేలిపోయింది. చాలా థియేటర్లు సగం కూడా నిండలేదు. మరోవైపు మూడో వారంలో ఉన్న 'దూకుడు'కి సోమవారం కూడా థియేటర్ల వద్ద సందడి కనిపించింది. తమ హీరోల అభివృద్ధిని కాంక్షించే నిజమైన అభిమానులు చేయాల్సింది వాస్తవ స్థితిని యథాతథంగా గుర్తించడం, ఎదుటి హీరోల సినిమాలు హిట్టయితే మనస్ఫూర్తిగా అభినందించి, తమ వంతు సూపర్‌హిట్ వచ్చేదాకా సంయమనం పాటించడం. 'ఊసరవెల్లి' కాకపోతే 'దమ్ము' ఉంది. అది బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపవచ్చు. అప్పటిదాకా ఓపిక పట్టండి. లేకపోతే ఈ రికార్డుల గోల ముదిరిపోయి, ఏ సినిమా విడుదలైనా మొదట రికార్డులకే ప్రాధాన్యం ఇచ్చి ఊదరగొట్టే ప్రమాదం ఉంది. ఇది అనారోగ్యకర వాతావరణాన్ని సృష్టిస్తుంది.

స్పెషల్ స్టోరీ: ఎవర్‌గ్రీన్ యాంగ్రీ యంగ్‌మ్యాన్!

యాంగ్రీ యంగ్‌మ్యాన్ ఆఫ్ ఇండియన్ సినిమా ఎవరంటే ఠక్కున స్ఫురించే పేరు అమితాబ్ బచ్చన్. తన కెరీర్‌లో రొమాంటిక్ హీరోగా, కమెడియన్‌గా, 'షరాబీ'గా, డ్రమటిక్ హీరోగా, ఇప్పుడు వయసుమళ్లిన వ్యక్తిగా... ఎన్నో పాత్రలు చేసినా యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గానే ఆయన ప్రేక్షకుల ఆరాధ్యతారగా మారారనడంలో సందేహం లేదు. 1970, '80ల్లో చేసిన అనేక సినిమాల్లో 'విజయ్'గా కనిపించి, విజయ సోపానాలు అధిరోహించి, తన సినీ జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు అమితాబ్. ఇందులో 'విజయ్' పాత్ర సృష్టికర్తలైన సలీమ్ (ఖాన్) - జావెద్ (అఖ్తర్) ద్వయం పాత్ర ఎంతో ఉంది. ఈ విజయ్ పాత్రల్ని ఓసారి పరిశీలిస్తే, వాటికీ, మహాభారతంలోని కర్ణ పాత్రకీ సారూప్యత కనిపిస్తుంది. చిన్నతనంలోనే అన్యాయానికి గురైన యువకుడిగా ఆ పాత్రల్లో దర్శనమిచ్చారు అమితాబ్. 'జంజీర్'లో చిన్నప్పుడే తల్లిదండ్రుల హత్యని కళ్లారా చూసిన ఆయన, అవివాహిత పుత్రుడిగా, తండ్రి ఎవరో తెలీకుండా పెరిగిన యువకుడిగా 'త్రిశూల్'లో కనిపించారు. 'దీవార్'లో అయితే ఓ గొడవలో మొత్తం కుటుంబాన్నే కోల్పోయినవాడిగా కనిపించారు. ఇలాంటి నేపథ్యాలతో యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా రూపొందాడు 'విజయ్'. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దుష్టుల అంతం చూసే ఆ పాత్రతో ప్రేక్షకులు సహానుభూతి చెందారు. విజయ్ నవ్వితే వారూ నవ్వారు. విజయ్ ఏడిస్తే వారూ ఏడ్చారు. అతను దుష్టుల్ని వెంటాడి వేటాడి చంపుతుంటే తామే వాళ్లని చంపుతున్నట్లు ఆ పాత్రలో మమేకమయ్యారు. ఆ పాత్రల పోషణతో అంతగా ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేశారు అమితాబ్.
అప్పుడే కాదు, అరవై ఏళ్లు దాటినా కూడా ఆయన పట్ల ప్రేక్షకుల్లో అభిమానం తగ్గలేదనడానికి ఆయన చేసిన సినిమాలే నిదర్శనం. 'సర్కార్', 'కభీ అల్విదా నా కెహనా', 'నిశ్శబ్డ్', 'చీనీ కుమ్', 'భూత్‌నాథ్', 'సర్కార్ రాజ్', 'పా', 'ఆరక్షణ్' వంటి ఒకదానికొకటి పూర్తి భిన్నమైన చిత్రాలతో ఆయన ఇటు ప్రేక్షకుల, అటు విమర్శకుల ప్రశంసల్ని పొందారు. 'పా' చిత్రంలో చూపులకి అరవై ఏళ్ల వృద్ధుడిగా కనిపించే పన్నెండేళ్ల పిల్లాడి పాత్రను అమోఘంగా పోషించి, జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించడం అపూర్వం. ఇక ఇటీవలే 69 సంవత్సరాల వయసులో 'బుడ్డా... హోగా తేరా బాప్' సినిమాలో యాక్షన్ రోల్ చేసి అబ్బుర పరచడం అమితాబ్‌కే చెల్లింది. ఎన్నిసార్లు ఆరోగ్య సమస్యలు తలెత్తినా మొక్కవోని దీక్షతో, అంకితభావంతో, చలాకీతనంతో నటనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న బిగ్ బి రానున్న రోజుల్లో మరిన్ని వైవిధ్యభరిత పాత్రలతో మనల్ని ఆశ్చర్యపరచడం ఖాయం.
(అక్టోబర్ 11న అమితాబ్ 70వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా)

Monday, October 10, 2011

స్పెషల్ స్టోరీ: రాజమౌళి విజయ దరహాసం!

దర్శకత్వం వహించిన ఎనిమిది సినిమాల్లో ఏడు విజయాలు సాధించిన దర్శకుడిగా యస్.యస్. రాజమౌళి తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ శాశ్వత పేజీని సంపాదించుకున్నారు. ఇదివరలో దాసరి నారాయణరావు తొలి సినిమా 'తాత మనవడు' నుంచి పదకొండో సినిమా 'మనుషులంతా ఒక్కటే' వరకు వరుసగా పదకొండు విజయవంతమైన చిత్రాలకు (ఈ మధ్యలో వచ్చిన 'రాధమ్మ పెళ్లి' బాక్సాఫీసు ఫలితం విషయంలో భిన్నాభిప్రాయాలున్నా) దర్శకత్వం వహించడం ఒక చరిత్ర అయితే, ఉండకూడనన్ని ప్రతికూల పరిస్థితులున్న నేటి కాలంలో ఎనిమిదింటిలో ఒకటి మినహా ఏడు హిట్లను అందించిన రాజమౌళిది ఇంకో చరిత్ర.
'స్టూడెంట్ నెం.1' (2002) నుంచి మొదలైన ఆయన విజయ విహారం మూడో సినిమా 'సై' మినహా 'మర్యాదరామన్న' (2010) దాకా అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. 'సై' సైతం ప్రేక్షకుల్ని అలరించినా, పెట్టుబడి ఎక్కువ కావడంతో లాభాలు సాధించలేకపోయింది. ప్రస్తుతం 'ఈగ' పేరుతో ఆయన తన తొమ్మిదో చిత్రాన్ని తెరకెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్టీఆర్‌ని 'స్టూడెంట్ నెం.1'తో మాస్‌కి చేరువ చేసిన ఆయన 'సింహాద్రి'తో టాప్ స్టార్‌ని చేశారు. ఆ సినిమా ప్రభావం ప్రేక్షకుల మీద ఎంతగా పడిందంటే, తర్వాత వచ్చిన ఎన్టీఆర్ సినిమాల్ని వారు 'సింహాద్రి'తో పోల్చుకుంటూ అసంతృప్తి చెందుతూ వచ్చారు. అలాంటి నేపథ్యంలో మరోసారి 'యమదొంగ'తో ఎన్టీఆర్‌కి విజయానందాన్ని చేకూర్చారు రాజమౌళి. అలా రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్‌కు తిరుగనేదే లేకుండా పోయింది. ఒక్క ఎన్టీఆర్‌తోనే కాకుండా మిగతా హీరోలకూ వాళ్ల కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాల్ని అందించారు రాజమౌళి. ప్రభాస్‌కు 'ఛత్రపతి', రవితేజకు 'విక్రమార్కుడు', రాంచరణ్‌కు 'మగధీర', సునీల్‌కు 'మర్యాదరామన్న' వంటి హిట్లనిచ్చారు. వీటిలో 'మగధీర' చిత్రం మునుపటి తెలుగు చలనచిత్ర వసూళ్ల రికార్డుల్ని తిరగరాసిన సంగతి ప్రస్తావనార్హం. మిగతా హీరోలతో ఆయన తీసిన చిత్రాలన్నీ అప్పటివరకు వాళ్ల కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని సాధించిన చిత్రాలు కావడం విశేషం.
ఇప్పుడు ఆయన తీస్తున్న 'ఈగ' పట్ల కూడా చిత్రసీమ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎక్కువగా గ్రాఫిక్స్ మీద ఆధారపడ్డ ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్లే ఓ 'ఈగ' ప్రధాన పాత్రధారిగా రూపొందుతోంది. విలన్ చేతిలో చనిపోయిన హీరో మరుజన్మలో ఈగగా పుట్టి ఆ విలన్ మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది ఇందులోని ప్రధానాంశం. హీరోగా నాని, విలన్‌గా కన్నడ నటుడు సుదీప్ నటిస్తున్న ఈ చిత్రంలో సమంత నాయిక. ఇటీవలే (సెప్టెంబర్ 27తో) పదేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్న అగ్ర దర్శకుడు రాజమౌళి మునుముందు తెలుగు సినిమా స్థాయి పెరగడంలో ప్రధాన పాత్ర పోషిస్తారని ఆశించవచ్చు.
(అక్టోబర్ 10 రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా)

Monday, October 3, 2011

బిగ్ స్టోరీ: అప్పుడు 'పోకిరి' పోలీస్! ఇప్పుడు 'దూకుడు' పొలీస్!!

ఈ ఏడాది తెలుగు చిత్రసీమలో ఎన్నో సినిమాలు విడుదలైనా ఎప్పటిలా కొన్నే హిట్టయ్యాయి. ఆ సినిమాల నిర్మాతలను గట్టెక్కించాయి. అయితే ఏడాది మూడోవంతు పూర్తవుతున్నా టాలీవుడ్‌కు అతి పెద్ద హిట్టు రాలేదనే బాధ సినీ వర్గాల్లో వ్యక్తమవుతూ వచ్చింది. మరోవైపు బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ సినిమాలు 'దబాంగ్', 'బాడీగార్డ్', అజయ్ దేవగన్ సినిమా 'సింగమ్' సినిమాలు రూ. వంద కోట్ల పైగా వసూళ్లతో సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో నిర్మాతల్నీ, డిస్ట్రిబ్యూటర్లనీ, ఎగ్జిబిటర్లనీ - అందర్నీ అమితానందపరుస్తూ వచ్చింది 'దూకుడు' చిత్రం. మహేశ్ కథానాయకుడిగా దర్శకుడు శ్రీను వైట్ల రూపొందించిన ఈ చిత్రం తొలి వారం కనీ వినీ ఎరుగని రీతిలో రూ. 35 కోట్ల షేర్ వసూలు చేసి, ట్రేడ్ పండితుల్ని సైతం ముక్కుమీద వేలేసుకునేట్లు చేసింది.
80 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇది అతిపెద్ద రికార్డు. ప్రపంచవ్యాప్తంగా 1600 పైగా థియేటర్లలో విడుదలైన 'దూకుడు' ప్రభంజనం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాక, దేశంకాని దేశమైన అమెరికాలోనూ సంచలన విజయం నమోదు చేయడం గమనార్హం. తొలివారం అక్కడ రూ. 5 కోట్లకు పైగా షేర్ సాధించడం అమెరికన్ ట్రేడ్ విశ్లేషకుల్నీ విస్మయ పరిచింది. అక్కడ ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాని సైతం ప్రదర్శించని థియేటర్లలోనూ 'దూకుడు'ని ప్రదర్శించడం విశేషం. ఇక్కడ ఆసక్తికరమైన సంగతేమంటే మహేశ్ పోలీస్ పాత్రలు చేసిన రెండు సినిమాలూ వాటి కాలాల్లో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన సినిమాలు కావడం.
2006లో తొలిసారి ఆయన పోలీస్ కేరక్టర్ చేసిన 'పోకిరి' సినిమా కలెక్షన్లలో అంతకు ముందున్న బాక్సాఫీసు రికార్డుల్ని తిరగరాసి రూ. 40 కోట్లకు పైగానే వసూలు చేసిన (అంచనా) తొలి తెలుగు సినిమాగా పేరు తెచ్చుకుంటే, ఐదేళ్ల తర్వాత మహేశ్ రెండోసారి 'పొలీస్' పాత్ర చేసిన 'దూకుడు' సైతం అంతకు మించిన కలెక్షన్లతో దూసుకుపోతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'పోకిరి'లో ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణమనోహర్‌గా మహేశ్ ప్రదర్శించిన నటన అందర్నీ ఆకట్టుకుంది. అందులో ఆయన చెప్పిన కట్ డైలాగ్స్ అలరించాయి. ఓ చోట 'ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్నార్రా నాన్నా' అంటూ ఆయన చెప్పిన డైలాగ్ బాగా పేలింది. తండ్రి (నాజర్)ని విలన్ ప్రకాశ్‌రాజ్ చంపినప్పుడు తొలిసారి పోలీసాఫీసర్ వేషంలో మహేశ్ వేగంగా పరుగెత్తుకుంటూ తండ్రి శవం వద్దకు వచ్చే సన్నివేశం సినిమాకే ఆయువుపట్టుగా నిలిచింది.
ఇప్పుడు 'దూకుడు'లో ఐపీఎస్ ఆఫీసర్ అజయ్‌కుమార్‌గా మహేశ్ నటన ప్రేక్షకుల్ని ఎంతగా అలరిస్తున్నదో కలెక్షన్లే తెలియజేస్తున్నాయి. కోమా నుంచి బయటకు వచ్చిన తండ్రి (ప్రకాశ్‌రాజ్) ప్రాణానికి హాని ఉండటంతో ఆయన వద్ద ఎమ్మెల్యేగా నటిస్తూ, మరోవైపు ఆయనకు అలాంటి స్థితి కలగడానికి కారణమైన దుష్టుల్ని పోలీసాఫీసర్‌గా ఏరిపారేసే సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తున్నాయి. 'ఎవర్నువ్వు?' అని ఎవరైనా అడిగితే 'పో'లీస్ అని కాకుండా 'పొ'లీస్ అంటూ ఆయన సమాధానం చెప్పే తీరు జనాన్ని ఆకట్టుకుంటోంది. ఇలా రెండు మార్లు పోలీస్ పాత్రలు చేసి, రెండు సార్లూ రికార్డు కలెక్షన్లు సాధించడంతో మహేశ్ అభిమానులు ఆనంద పరవశులవుతున్నారు. అయితే రానున్న రోజుల్లో దీన్నో సెంటిమెంటుగా భావించి, రచయితలూ, దర్శకులూ ఈ తరహా పాత్రలతో ఆయన వద్దకు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే ఆ పాత్రల్లో మొనాటనీ లేకుండా చూసుకోవడం మహేశ్ వంతు.

న్యూస్: 'దూకుడు'ని అడ్డుకోవడమే 'ఊసరవెల్లి' లక్ష్యం!

మొత్తానికి 'ఊసరవెల్లి'ని అక్టోబర్ 6న రిలీజ్ చేయడానికే నిర్మాత ఛత్రపతి ప్రసాద్ నిశ్చయించేశారు. ఈ సినిమా నిజంగా 6న వస్తుందా లేక, 13కి వాయిదా పడుతుందా? అనే సందేహం తలెత్తింది. ఎందుకంటే సెప్టెంబర్ 23న రిలీజైన మహేశ్ 'దూకుడు' రికార్డ్ కలెక్షన్లు సాధిస్తోంది. ఎక్కువ థియేటర్లలో ఆడుతోంది. అలాంటప్పుడు 'ఊసరవెల్లి'కి ఎక్కువ థియేటర్లు దొరుకుతాయా అనే సందేహం కలిగింది. పైగా 'ఊసరవెల్లి'కి మంచి కలెక్షన్లు రావాలన్నా ఒక వారం ఆలస్యంగా విడుదల చేస్తేనే మంచిదనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల అభిప్రాయం ప్రకారం 'ఊసరవెల్లి' అక్టోబర్ 13న విడుదలైతే ఇటు దానికీ, అటు 'దూకుడు'కీ ప్రయోజనం ఉంటుందని వాళ్లు సూచిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మరో రకంగా తలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 'దూకుడు' రికార్డులకి బ్రేక్ వెయ్యడంతో పాటు, టాలీవుడ్ నెంబర్‌వన్ రేసులో తానూ ముందున్నట్లు చెప్పాలనేది అతని అభిమతంగా ఫిలింనగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన 'అశోక్' ఫెయిలైంది. ఇప్పుడు ఎలాగైనా సూపర్‌హిట్ కొట్టాలనే తపనతో ఆ ఇద్దరూ 'ఊసరవెల్లి'కోసం కృషిచేశారు. తప్పుకుండా ఈ సినిమా బిగ్ హిట్టవుతుందనే నమ్మకం ఎన్టీఆర్‌లో కనిపిస్తోంది. అందుకే ఆరునూరైనా అక్టోబర్ 6నే సినిమా విడుదల చేయాలని అతను పట్టుపట్టడంతో నిర్మాత ప్రసాద్ మరో దారిలేక విడుదలకు సిద్ధమయ్యారు. ఒక్కటి మాత్రం నిజం. 'ఊసరవెల్లి' రాక 'దూకుడు' రికార్డుల్ని ప్రభావితం చేయనున్నది. ఆ ప్రభావం థియేటర్ల సంఖ్య మీదా, కలెక్షన్ల మీదా కనిపించనున్నది. చూద్దాం, ఎన్టీఆర్ పట్టుదల చివరికి ఎలాంటి పరిస్థితుల్ని కల్పిస్తుందో...

న్యూస్: కెరీర్ క్రైసిస్‌లో జాతీయ ఉత్తమ బాలనటుడు

బాలనటుడిగా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న తరుణ్ హీరోగా మాత్రం దాన్ని కొనసాగించలేక నానా తంటాలు పడుతున్నాడు. రోజులు అతననుకున్న విధంగా సాగడం లేదు. హీరోగా నటించిన తొలి చిత్రం 'నువ్వే కావాలి' (2000) సూపర్ డూపర్ హిట్ కావడంతో లవర్ బాయ్‌గా అమ్మాయిల హృదయాల్లో చోటు సంపాదించిన అతను, ఆ తర్వాత క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చాడు. అంకుల్, చిరుజల్లు, అదృష్టం, ఎలా చెప్పను, నీ మనసు నాకు తెలుసు, నిన్నే ఇష్టపడ్డాను, ఎలా చెప్పను, సఖియా, సోగ్గాడు, ఒక ఊరిలో, నవ వసంతం, భలే దొంగలు, శశిరేఖా పరిణయం సినిమాలు బాక్సాఫీసు వద్ద వైఫల్యాల్ని చవిచూడటం అతని ఇమేజ్‌ని దెబ్బతీశాయి. 'నువ్వే కావాలి' కాక మరో రెండు సినిమాలు 'ప్రియమైన నీకు', 'నువ్వే నువ్వే' మాత్రమే హిట్టయ్యాయి.
వాస్తవానికి మంచి ఈజ్‌తో నటించగల సమర్థుడిగా తరుణ్ మంచి పేరే పొందాడు. తల్లిదండ్రులు రోజారమణి, చక్రపాణి ఇద్దరూ నటులే కావడంతో నటన అతనికి సహజంగా అబ్బింది. అలా అని చిన్నతనంలో సినిమాల్లో నటించాలని అతను అనుకోలేదు. ఎప్పుడైతే మణిరత్నం సినిమా 'నాయకుడు' చూశాడో అప్పట్నించీ సినిమాలపై అతని ధ్యాస మళ్లింది. మణిరత్నం రూపొందించిన 'అంజలి' చిత్రం ద్వారా బాలనటుడిగా సినిమాల్లోకి ప్రవేశించి, తొలి సినిమాతోనే ఉత్తమ బాలనటునిగా జాతీయ అవార్డును పొందాడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, ఒరియా భాషల్లో మొత్తం 17 సినిమాల్లో బాలనటునిగా నటించిన తరుణ్ మలయాళ సినిమా 'నీరం' ఆధారంగా రూపొందిన 'నువ్వే కావాలి'తో హీరోగా రంగప్రవేశం చేసి ప్రేక్షకాదరణ పొందాడు. అలాంటి అతను ఇవాళ కెరీర్ క్రైసిస్‌ని చవిచూస్తుండటం ఆశ్చర్యకరమే. సబ్జెక్టుల ఎంపికలో తెలివిగా నడచుకోకపోవడమే దీనికి కారణమని విశ్లేషకుల అభిప్రాయం. చాలా రోజుల క్రితమే పూర్తయిన 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి', షూటింగులో ఉన్న 'అనుచరుడు' సినిమాల మీదే అతని ఆశలన్నీ ఉన్నాయి. వీటితోనైనా ఒకప్పటి ఈ బెస్ట్ చైల్డ్ యాక్టర్ బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకుంటాడా?

Sunday, October 2, 2011

న్యూస్: జమీందార్లు పోయినా 'పిల్ల జమీందార్' వదలట్లేదు!

మొత్తానికి 'పిల్ల జమీందార్' పాటలు విడుదలయ్యాయి. నాని సరసన అంతగా గ్లామర్‌లేని హరిప్రియ, బిందుమాధవి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి తమిళ సంగీత దర్శకుడు సెల్వగణేశ్ మ్యూజిక్‌నిచ్చాడు. ఈ సినిమా బాగా ఆలస్యం కావడానికి గల కారణాల్ని నిర్మాత డి.ఎస్. రావు ఆవేదనా రూపంలో వ్యక్తం చేశాడు. సమ్మెలతో పాటు పలు ఆటంకాలు కలగడం వల్లే సినిమా మేకింగ్‌లో ఇంత ఆలస్యం జరిగిందనీ, అయితే శ్రమకు తగ్గ ఫలితం దక్కిందనీ ఆయన చెప్పాడు. పదేళ్ల నుంచీ హిట్ కోసం మొహం వాచిపోయాననీ, ఈ సినిమాతో ఆ దాహం తీరుతుందనీ గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమా ద్వారా అశోక్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఎప్పుడో రాష్ట్రంలో జమీందారీలకు కాలం చెల్లిపోయినా మన సినిమా వాళ్లు మాత్రం ఆ జమీందారీలని ఇంకా వదిలిపెట్టలేదనే దానికి ఈ సినిమా మరో ఉదాహరణ. యువకుడైన అశోక్ మరి ఇలాంటి కథని ఎందుకు ఎంచుకున్నాడో తెలీదు. పాటల చిత్రీకరణ, వాటి బాణీలు చూస్తే మాత్రం సెల్వ గణేశ్ బాగానే పనిచేసినట్లు అర్థమవుతుంది. అయితే నాని తప్ప ఈ సినిమాకి జనాన్ని తీసుకువచ్చే మరో ఆకర్షణ ఏదీలేని స్థితిలో పదేళ్లకైనా డి.ఎస్. రావు హిట్ కలని 'పిల్ల జమిందార్' తీరుస్తాడో, లేడో...

సంస్కృతి: 'కల్చర్', 'సంస్కృతి' ఒకటేనా?

'కల్చర్' అనే ఇంగ్లీష్ మాటకు సమానార్థకమైన దాన్నిగా 'సంస్కృతి'ని మనం వాడుతున్నాం. అమరకోశంలో ఈ శబ్దం లేదు. బ్రౌణ్యంలో ఇది కనిపించదు. 'శబ్ద రత్నాకరం', 'శబ్దార్థ చంద్రిక'లను దీనికోసం వెదకడం వృథాశ్రమ. 'సూర్యరాయాంధ్ర నిఘంటువు', 'వావిళ్ల నిఘంటువు'లో ఈ పదానికి చోటు దక్కలేదు. అయితే అన్నింటిలోనూ 'సంస్కృతము' కనిపిస్తుంది. ఈ మాటకు శబ్ద రత్నాకరమిచ్చే అర్థం విశేష్యంగా 'దేశభాష', అన్య విశేషణంగా - చక్కగా జేయబడినది, చక్కజేయబడినది, అలంకరించబడినది, వ్యాకరణ శిక్షితమైనది, పక్వము చేయబడినది, శ్రేష్ఠమైనది - అని. ఈ విశేషణాల్లో కొన్ని 'కల్చర్'కు వర్తిస్తాయి కాబట్టే, 'సంస్కృతము' నుంచి వచ్చిన ఈ కొత్త పదం 'సంస్కృతి' వేగంగా సర్వజనామోదం పొంది, బహుళ వ్యాప్తిలోకి వచ్చింది. తెలుగులోనే కాక హిందీ, బెంగాలీ వంటి ఇతర భాషల్ల్లోనూ ఇది విశేష ప్రచారంలో ఉంది.
'కల్చర్' అనే మాటను షేక్‌స్పియర్, మిల్టన్, బైరన్, షెల్లీ వంటి పూర్వ ఆంగ్ల కవులెవరూ ఉపయోగించలేదు. ఎన్. బెయిలీ 1736లో ప్రచురించిన తన ఇంగ్లీష్ డిక్షనరీలో 'కల్చర్'కు సేద్యాన్ని ప్రధానార్థంగా పేర్కొని, ఉత్తమ వాద్యంతో మానసిక వికాసానికి, దాన్ని పర్యాయపదంగా ప్రయోగించవచ్చని సూచించాడు. సంస్కృతి అనే ఇప్పటి అర్థాన్ని 'కల్చర్'కు కల్పించినవారిలో అమెరికన్ రచయిత ఆర్.డబ్ల్యు. ఎమర్సన్, బ్రిటీష్ రచయిత మాథ్యూ ఆర్నాల్డ్ అగ్రగణ్యులు. ఈ ఇద్దరూ 19వ శతాబ్దానికి చెందినవారే.
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ వివరణ ప్రకారం 'కల్చర్'కు మొదట్లో ఉన్న అర్థం 'టిల్లేజ్' (సేద్యం) అని మాత్రమే. ఫ్రెంచి అకాడమీ వాళ్లు తమ నిఘంటువులో 'కల్చర్' అనే పదాన్ని లలిత కళల పట్ల, మానసిక వికాషం పట్ల ఆసక్తి అనే వివరణతో 1762లో తొలిసారిగా ప్రవేశపెట్టారు. మానవ నాగరికత చరిత్రను 'ద స్టోరీ ఆఫ్ సివిలైజేషన్' పేరుతో ప్రతిభావంతంగా రాసిన రాసిన అమెరికన్ రచయిత విల్ డూరాంట్ వివరణ ప్రకారం మొదట్లో 'కల్చర్' అనేది వ్యక్తమైంది 'అగ్రికల్చర్' రూపంలోనే.

Saturday, October 1, 2011

న్యూస్: ఆల్‌టైం రికార్డ్ దిశగా 'దూకుడు'

టాలీవుడ్ చరిత్రలో ఆల్‌టైం రికార్డ్ దిశగా మహేశ్-శ్రీను వైట్ల సినిమా 'దూకుడు' దూసుకుపోతోంది. తొలివారం కనీ వినీ ఎరుగని రీతిలో రూ. 50.07 కోట్ల గ్రాస్, రూ. 35.01 కోట్ల షేర్ సాధించి దక్షిణ భారత రికార్డుని సాధించింది. ఈ విషయంలో రజినీకాంత్ 'రోబో'ని సైతం అది అధిగమించడం విశేషం. తొలివారం కలెక్షన్ల విషయంలో 80 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రని 'దూకుడు' తిరగరాసిందని ఆ చిత్ర నిర్మాతలు రాం ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర తెలిపారు. విడుదలైన ప్రతి ఏరియాలోనూ 'దూకుడు' సినిమా ఆల్‌టైం రికార్డ్ సృష్టించిందని వారు చెప్పారు. నైజాం ఏరియాలో తొలివారం 'దూకుడు' 12.51 కోట్ల గ్రాస్, 8.52 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ పండితుల్ని నివ్వెరపోయేట్లు చేసింది. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లోనూ ఈ సినిమా ఇలాంటి ఫీట్ సాధించడం అద్భుతమనే చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా అమెరికాలో 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించడం అపూర్వం. అందుకే అక్కడి లాస్ ఏంజిల్స్ టైమ్స్, వెరైటీ లాంటి ప్రఖ్యాత పత్రికలు సైతం 'దూకుడు' విజయంపై ప్రత్యేక కథనాలు రాశాయి. మునుముందు ఈ సినిమా ఎన్ని రికార్డులు సాధిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు చిన్న చిన్న హిట్లతోనే సరిపెట్టుకుంటూ వచ్చిన టాలీవుడ్‌కి ఇదే తొలి అతి పెద్ద విజయం కావడం గమనార్హం.